అబద్ధాలు చెప్పడంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy Comments) విమర్శించారు. రాష్ట్ర రాజకీయాల్లో హుజూరాబాద్ బై ఎలక్షన్ కీలక మార్పులు తీసుకొస్తుందన్నారు. హుజూరాబాద్ ప్రజలు సీఎం కేసీఆర్... మాటలు నమ్మలేదన్నారు. నీతి, నిజాయతీకి ప్రతిరూపంగా ఈటల పని చేశారని కొనియాడారు. ఈటల రాజేందర్ సతీమణి జమున విస్తృతంగా ప్రచారం చేశారని ప్రశంసించారు. హుజూరాబాద్ ఆడ బిడ్డలకు పేరు పేరున నమస్కరిస్తున్నానని తెలిపారు.
హుజూరాబాద్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు దళిత బంధు పథకం వచ్చింది. తెరాస కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కవులు, కళాకారులు, మేధావులు పని చేశారు. హనుమకొండలో విజయగర్జన కాదు కల్వకుంట్ల గర్జన పెట్టుకోండి. తెలంగాణ వచ్చింది.. కేసీఆర్ కుటుంబం వల్ల కాదు. తెలంగాణ వ్యతిరేక శక్తులు ప్రగతి భవన్లో ఉన్నాయి. నిజమైన ఉద్యమకారులకు ఉద్వాసన పలుకుతున్నారు. ఉద్యమకారులు తెరాసలో ఉండటానికి ఇష్టపడటం లేదు. ఉద్యమకారులు, కవులు, కళాకారులు, మేధావులు భాజపాలోకి రావాలని ఆహ్వానం పలుకుతున్నాం. కుటుంబ పాలనకు చరమగీతం పాడండి. తెలంగాణ ప్రజలు డబ్బులకు లొంగరని నిరూపించారు.