Kishan Reddy fire on CM KCR సీఎం కేసీఆర్‌ది నిజాం తరహా నియంతృత్వ పాలన అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రికి అసహనం, అభద్రతాభావం పెరిగిపోతోందన్నారు. బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. భాజపా కార్యకర్తలపై దాడులు చేయాలని సీఎం కార్యాలయం నుంచే ఆదేశాలు వచ్చాయని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబపాలన నుంచి త్వరలోనే తెలంగాణకు విముక్తి లభిస్తుందన్నారు. వినాశకాలే విపరీతబుద్ధి అని ఆయన గుర్తుంచుకోవాలని కిషన్‌రెడ్డి హితవు పలికారు.
బండి సంజయ్ యాత్రను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. కేసీఆర్‌ది నిజాం తరహా నియంతృత్వ పాలన. హుజూరాబాద్‌లో అహంకారాన్ని ప్రజలు తిప్పికొట్టారు. కేసీఆర్‌కు అసహనం, అభద్రతాభావం పెరిగిపోయింది. తెలంగాణ ప్రజలు కుటుంబ, అవినీతి పాలన వ్యతిరేకిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల్లో కేసీఆర్‌పై వ్యతిరేకత వచ్చింది. ప్రగతిభవన్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మోదీపై ఆరోపణలు.- కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
ఇప్పటికే హుజురాబాద్‌లో కేసీఆర్ అహంకారాన్ని ప్రజలు ఓడించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు కుటుంబ, అవినీతి పాలన వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల్లో కేసీఆర్‌పై వ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రగతిభవన్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మోదీపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మెజార్టీ తెరాస కార్యకర్తలు అధికారం ఉందని మాత్రమే ఆ పార్టీలో ఉన్నారన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణ చేతకాదని ప్రభుత్వం పరోక్షంగా ఒప్పకుందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ మాట్లాడుతున్న భాష అసహ్యంచుకునేలా ఉందన్నారు. బండి సంజయ్ పాదయాత్రకు తెలంగాణ ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని తెలిపారు. కేసీఆర్ కుటుంబం వంతుల వారీగా మోదీని విమర్శిస్తున్నారని.. ప్రధాని ఏనాడు కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ మాదిరిగా దిగజారి ప్రవర్తించరని.. కేసీఆర్ కుటుంబ పర్యవేక్షణలో ఆయుధాలతో సంజయ్ యాత్రపై దాడి చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు.
కుట్రలో భాగంగానే సంజయ్‌ని అరెస్ట్ చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం పుణ్యమా అని తెలంగాణ పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందన్నారు. మునుగోడు సమరభేరి సభకు జనం రాకుండా పోలీసులు అడ్డుకున్నారని.. భాజపా సభకు వచ్చిన జనాన్ని చూసి జీర్ణించుకోలేకపోయారని తెలిపారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని.. అలాగే తెలంగాణలో ఎట్లైతే సూర్యుడు ఉదయిస్తడో.. భాజపా అలాగే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.