కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy Comments) హైదరాబాద్‌లో పర్యటించారు. అంబర్‌పేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన... భారీ వర్షాల నిమిత్తం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, బాగ్ అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి.. పోచమ్మ బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీ హాల్‌ను ప్రారంభించారు. జీహెచ్ఎంసీ కమిషనర్, అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి భారీగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటానని కిషన్ రెడ్డి అన్నారు.
అనంతరం నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని కార్వాన్ దర్బార్ మైసమ్మ దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కొవిడ్ మహమ్మారిని ప్రజలు అంతా ఏకతాటిపై ఉండి తరిమికొట్టాలని కిషన్‌రెడ్డి (Kishan Reddy Comments) తెలిపారు. ఈ దసరా వరకు వందకోట్ల టీకాల మైలురాయిని భారత ప్రభుత్వం చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.