Kishan Reddy Tweet: పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు పదవిలో ఉన్న వాళ్లందరూ ప్రధాని నరేంద్రమోదీని కలుస్తారు.. కానీ ఫాంహౌస్‌లో ఉండే సీఎంను కలవటం మాత్రం కష్టమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అధికార ప్రతిపక్ష నేతలు కూడా మోదీని కలుస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం తన కుటుంబ సభ్యులు, బంధువులను మాత్రమే కలుస్తారని ట్విటర్ వేదికగా కిషన్‌రెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు.
జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో రెండు రోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. దిల్లీలోని 7-లోక్‌కల్యాణ్ మార్గ్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో 46 మంది కార్పొరేటర్లు సహా మొత్తం 76 మంది నాయకులతో ప్రధాని సుమారు గంటన్నరపాటు సమావేశమయ్యారు. వారి యోగక్షేమాలు, అనుభవాలు, రాష్ట్ర స్థితిగతులు తెలుసుకుంటూనే.. భవిష్యత్తుపై దిశానిర్దేశం చేశారు.