Kishan Reddy Chit Chat: భాజపాను బద్నాం చేసేందుకు సీఎం కేసీఆర్ తిరుగుతున్నారని... రైతుల మీద ప్రేమతో కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కోసం మిల్లర్లతో మాట్లాడాలని సూచించారు. బియ్యం కొనేందుకు రూ. 25 కాదు 35 వేల కోట్లు ఖర్చు చేస్తామని... నూకల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
హుజూరాబాద్ ఎన్నికల ముందు అగ్రిమెంట్ చేసుకుని ఇప్పుడు తొండి ఆటెందుకని ప్రశ్నించారు. మెడమీద కత్తి ఎవరూ పెట్టారు? అప్పుడు ప్రజలు, రైతులకు ఎందుకు చెప్పలేదన్నారు. గతేడాది స్టాక్ ఇప్పటి వరకు ఇవ్వలేదని తెలిపారు. బియ్యం చివరి గింజ వరకు కొంటామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాల కోసం రైతులను బలిపశువులను చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గోనె సంచులను కూడా కొనడం లేదన్నారు. కేంద్రం బియ్యం కోసం రూ. 36 ఇస్తుంటే... రాష్ట్రం రూ. 3 మాత్రమే ఇస్తోందన్నారు.
మేం ఎక్కడా చెప్పలేదు: తాము కందిపప్పు ఉచితంగా పంపిస్తే ఒక్కరికి కూడా ఇవ్వలేదని కిషన్రెడ్డి విమర్శించారు. తాము మీటర్లు పెడ్తామంటూ చెప్పలేదని... ఆదేశాలు కూడా లేవని తెలిపారు. దానికి సంబంధించి ఏవైనా పేపర్లు ఉంటే చూపించాలని తెరాస నేతలను అడగాలని ప్రజలకు సూచించారు. రిజర్వేషన్ విషయంలో రాజ్యాంగ విరుద్ధంగా తీర్మానం చేసి పంపించారని... రిజర్వేషన్‌లు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. మిజోరాం, మణిపూర్‌లలో రాష్ట్ర ప్రభుత్వాలే రిజర్వేషన్‌లు ఇస్తున్నాయన్నారు. ముస్లిం రిజర్వేషన్‌లు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు తెలిపిందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సాయంత్రమే రిజర్వేషన్ల జీవో విడుదల చేస్తే అడ్డుకోమని చెప్పారు.
వారి భాష నాకు రాదు: మెడికల్ కాలేజీల ఏర్పాటుకు తగిన రూల్స్ పాటించాలన్నారు. ఎంసీఐ అనుమతి ఆసుపత్రికి ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రపోజల్స్ సరిగా పంపించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇవ్వాలని... పట్టించుకోకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్తాయని తెలిపారు. తమ కార్యకర్తలకు దెబ్బలు తగులుతున్నాయని... ఓ కార్యకర్తకు తగిలిన దెబ్బతో ప్రెగ్నెన్సీ కోల్పోయిందని తెలిపారు. పైసలు తీసుకుని కూడా తమకు ఓటేయలేదని కేసీఆర్‌కు కోపం ఉందన్నారు. బలవంతంగా ఓట్లు వేయించుకోవాలనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తాను వాళ్ల భాష మాట్లాడలేనని తెలిపిన కిషన్ రెడ్డి... ఆ భాష తనకు రాదన్నారు.
ఇదీ చదవండి:Rahul vs Kavitha Tweet: ధాన్యం సేకరణపై రాహుల్ ట్వీట్.. కవిత కౌంటర్