తెలుగు రాష్ట్రాల జలవివాదాలను ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి లోబడి పరిష్కరించే దిశగా దాదాపు ఏకాభిప్రాయం సాధించినట్లు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. ఎజెండాలోని 5 అంశాల్లోనూ ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణ, కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించడం, గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటు కోసం ఇరురాష్ట్రాలు విజ్ఞప్తులు పంపడంపై ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు. నదీ యజమాన్య మండళ్ల (బోర్డుల) పరిధిని నోటిఫై చేయడంపై తెలంగాణ సీఎం అభ్యంతరం వ్యక్తం చేసినా, విభజన చట్టం ప్రకారం దానిపై కేంద్రం ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కృష్ణా జల వివాదాల పరిష్కారాన్ని మళ్లీ ట్రైబ్యునల్‌కు ప్రతిపాదించే అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు ఉపసంహరించుకున్నాక నిర్ణయం తీసుకుంటామని చెప్పామన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం గజేంద్రసింగ్ షెకావత్ విలేకర్లతో మాట్లాడారు. వివిధ అంశాలపై విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
‘‘సమావేశం ఫలవంతంగా జరిగింది. అన్ని అంశాలపైనా చర్చించాం. దాదాపు ఏకాభిప్రాయం సాధించగలిగాం. ఇరురాష్ట్రాల మధ్య ప్రాజెక్టులవారీగా జలాల పంపిణీని ట్రైబ్యునల్ నిర్ణయిస్తుంది. వాటిని బోర్డులు అమలుచేస్తాయి. ఒకసారి మేం బోర్డుల పరిధిని నోటిఫై చేస్తే అధికార పరిధిపై సమస్యలు ఉత్పన్నంకావు. ఏ రాష్ట్రం కొత్త ప్రాజెక్టులు చేపట్టినా వాళ్లు చట్టబద్ధమైన నిబంధనలు, ప్రక్రియలకు కట్టుబడి ఉండాల్సిందే. కృష్ణా జల వివాదాలను పరిష్కరించే బాధ్యతను ఇప్పుడున్న ట్రైబ్యునల్‌కే అప్పగించాలా? లేదంటే కొత్తది వేయాలా? అన్నది న్యాయసలహా తీసుకున్నాక నిర్ణయిస్తాం. ప్రాజెక్టుల నిర్వహణను బోర్డులే చేపట్టాలి. ఒకసారి బోర్డుల పరిధిని నోటిఫై చేశాక ప్రాజెక్టుల నియంత్రణ వాటి పరిధిలోకి వెళ్తుంది. గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటు కోసం రెండు రాష్ట్రాలూ ప్రతిపాదనలు పంపితే పరిగణలోకి తీసుకుంటాం. పోలవరం ప్రాజెక్టుకు నిధులు మేం రీఎంబర్స్‌మెంట్ విధానంలోనే చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు సమర్పించిన బిల్లులన్నీ చెల్లించాం. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున సాధ్యమైనంత త్వరగా పూర్తికావాలని కోరుకుంటున్నాం. వాళ్లు నిర్మాణ వేగాన్ని పెంచాలి. ఈ నెలాఖరులోకానీ, వచ్చేనెలలో కానీ ఆ ప్రాజెక్టు సందర్శనకు వెళ్తా’’ అని జల్‌శక్తి మంత్రి చెప్పారు.
నేనేమీ దేవుణ్నికాదు..
సమస్యలన్నీ పరిష్కారమైనట్లు మీరు నమ్ముతున్నారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ ‘‘నేనేమీ దేవుణ్నికాదు.. అలా చెప్పడానికి. సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. క్రమం తప్పకుండా సమావేశమైతే అవి తగ్గుతాయి. కౌన్సిల్ సమావేశాలను ఏడాదికి ఒకసారైనా ఏర్పాటుచేయాలని ప్రతిపాదించాను. ఇద్దరు ముఖ్యమంత్రులూ అంగీకరించారు. గోదావరి-కావేరీ అనుసంధానం గురించి చర్చ జరగలేదు. 2015లో కృష్ణా ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి, ఇంతవరకూ దాన్ని మేం నోటిఫై చేయలేదు. శాశ్వత ట్రైబ్యునల్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లు ఇంకా రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. అక్కడ పాసైన వెంటనే ట్రైబ్యునల్ ఏర్పడుతుంది’’ అని షెకావత్ పేర్కొన్నారు.
ఎజెండాలోని అంశాల వారీగా కేంద్రమంత్రి స్పందన
1. బోర్డుల పరిది:
కృష్ణా, గోదావరి బోర్డుల అధికార పరిధిని కేంద్రం నోటిఫై చేస్తుంది. ఈ రెండింటిపై రాష్ట్రాలతో చర్చించాం. తెలంగాణ ముఖ్యమంత్రి దీనిపై వ్యతిరేకత వ్యక్తంచేశారు. (కొత్త ట్రైబ్యునళ్లు ఏర్పాటుచేసిన తర్వాతే వాటి అధికార పరిధులను ప్రకటించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు). దీనిపై ఇరురాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం వచ్చాక నిర్ణయం జరగాలని కోరుకుంటున్నాం. ఏకాభిప్రాయం సాధ్యంకాకపోతే మేమే నోటిఫై చేయాలని నిర్ణయించాం. అందుకు కేసీఆర్ స్పందిస్తూ ‘ఒకవేళ మీరు అలా చేయాలనుకుంటే చేసుకోండి’ అన్నారు.