తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపుపై కేంద్ర జలశక్తిశాఖ అధ్యయనం - Polavaram Project news

పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపుపై కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ దృష్టి సారించింది. ఎత్తు తగ్గించడం వల్ల ముంపు సమస్య తగ్గించడంతో పాటు...ప్రాజెక్ట్ నిర్మాణ ఖర్చు సైతం భారీగా తగ్గే అవకాశం ఉన్నందున...దీనిపై అధ్యయనం చేసినట్లు సమాచారం. అయితే గతంలో ఆమోదించిన డిజైన్​ను మార్చడానికి కానీ, ఎత్తు తగ్గించడానికి కానీ వీలుకాదని కేంద్ర జలసంఘం స్పష్టం చేసినట్లు సమాచారం.

పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపుపై కేంద్ర జలశక్తిశాఖ అధ్యయనం
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపుపై కేంద్ర జలశక్తిశాఖ అధ్యయనం

By

Published : Feb 27, 2021, 6:27 AM IST

పోలవరం ముంపు సమస్యను తగ్గించేందుకు ప్రాజెక్ట్‌ ఎత్తు తగ్గించేందుకు ఉన్న అవకాశాలపై కేంద్ర జలశక్తిశాఖ అధ్యయనం చేసినట్లు తెలిసింది. ప్రాజెక్టు ప్రయోజనాలు దెబ్బతినకుండా ఎంత మేర ఎత్తు తగ్గిస్తే ముంపు నివారించవచ్చన్న అంశంపై కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ తదితర సంస్థలను సంప్రదిస్తున్నట్లు సమాచారం. కనీస నీటిమట్టం 41.15 మీటర్ల నుంచి 38.05 మీటర్ల వరకు తగ్గించడంతోపాటు కనీస నీటిమట్టాన్ని తగ్గించడం వల్ల ముంపుతో పాటు నిర్మాణ వ్యయాన్ని నియంత్రించవచ్చనే ప్రతిపాదనతో కూడిన 6 పేజీల లేఖ కేంద్ర జల్ శక్తి శాఖ ముందుకు రావడంతో.. దీనిపై ఈనెల 16న దిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి చర్చించినట్లు తెలిసింది.

ఎత్తు తగ్గింపు సాధ్యాసాధ్యాలపై చర్చ

పోలవరం పూర్తిస్థాయి నీటిమట్లం 45.72 మీటర్లు కాగా...కనీస నీటిమట్టం 41.15 మీటర్లు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే లక్షా 38వేల 500 ఎకరాలు మునిగిపోవడంతోపాటు...లక్ష కుటుంబాలు నిర్వాసితమవుతాయి. బ్యాక్‌ వాటర్‌ ప్రభావాన్ని సరిగా అధ్యయనం చేస్తే...ముంపు సమస్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. పొలవరు కుడికాలువకు నీటిని తీసుకోవాలంటే ప్రాజెక్ట్‌లో నీటిమట్టం 35.5 మీటర్లు ఉండాల్సి ఉండగా...ఎడమ కాలువకు 33 మీటర్ల వరకు ఉన్నా సరిపోతుంది. కేంద్ర జలసంఘం ఆమోదించిన డీపీఆర్ ప్రకారం కుడి కాలువ ద్వారా 343 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 226 క్యూసెక్కులు మళ్లించాలి. ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాల ఆయకట్టుతోపాటు, విశాఖకు తాగు, పారిశ్రామిక అవసరాలకు 23.436 టీఎంసీల నీరు ఇవ్వాల్సి ఉంటుంది. కుడికాలువ కింద 3.2 లక్షల ఎకరాలకు సాగునీరు తోపాటు, కృష్ణా బేసిన్‌కు 80 టీఎంసీలు మళ్లించాలి . కేంద్ర జలసంఘం ఆమోదించిన ప్రకారం జులై నుంచి నవం బరు మధ్యలోనే దాదాపు 30 నుంచి 50 టీఎంసీల నీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే తక్కువ నీటి నిల్వతోనే నదిలోకి వచ్చే నీటిని మళ్లించడానికి అవకాశం ఉంది.

మిగిలిన నెలల్లో గోదావరి డెల్టా అవసరాలకోసం 17.3 మీటర్ల వద్ద ఉండే రివర్స్ స్లూయిజ్‌ నుంచి కనీస నీటిమట్టానికి మధ్య ఉండే వ 83 టీఎంసీలను వినియోగించుకోవచ్చు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని కనీస నీటిమట్టాన్ని 41.15 మీటర్ల నుంచి 38.05 మీటర్ల వరకు తగ్గించవచ్చని సమాచారం. కొత్తగా కనీస నీటిమట్టాన్ని 38.17 మీటర్లుగా నిర్ణయిస్తే సరిపోతుందని ఉన్నతస్థాయి సమావేశంలో చర్చ జరిగింది. కుడి కాలువ కన్నా కింద నుంచే ఎడమ కాలువ నీటిని తీసుకునేలా డిజైన్‌ చేశారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సాగు, తాగు అవసరాలతో రాజీ పడకుండానే పూర్తి స్థాయి నీటిమట్టాన్ని కూడా తగ్గించి 41.17 మీటర్లు చేస్తే సరిపోతుంది. దీని వల్ల ముంపు కుటుంబాల సంఖ్య లక్షా 7వేల నుంచి 45 వేలకు తగ్గుతుంది. నిర్మాణ వ్యయం కూడా 55వేల కోట్ల నుంచి 30వేల కోట్లకు పరిమితమవుతుందని. కేంద్ర జలశక్తికి అందిన 6 పేజీల లేఖలో ఉన్నట్లు సమాచారం.

లేఖలోని అంశాలతోపాటు, డిజైన్‌కు సంబంధించిన అంశాలపై జలసంఘం, పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ అధికారులు, జలశక్తి మంత్రిత్వశాఖ సలహాదారులు చర్చించారు. అయితే పోలవరం ప్రాజెక్టు గరిష్ట వరద ప్రవాహం 50 లక్షల క్యూసెక్కు లుగా అంచనా వేసినందున.. ఏ నిర్ణయమైనా దీనికి అనుగుణంగా తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. గతంలో ఆమోదించిన డిజైన్‌లో ఎలాంటి మార్పు చేయడానికి వీల్లేదని, ఎత్తు తగ్గించడం కూడా వీలు కాదని కేంద్ర జలసంఘం స్పష్టం చేసినట్లు తెలి సింది. గరిష్ట వరద ప్రవాహం వచ్చినప్పుడు ముంపు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల సమస్యలొస్తాయనే అభిప్రాయం కూడా వ్యక్తమైనట్లు తెలిసింది. ప్రాజెక్టు ప్రయోజనాలతో రాజీ పడకుండా గరిష్ఠ వరద ప్రవాహాన్ని తట్టుకునేలా డిజైన్ ఉండాలని, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఒక మీటరు మించి తగ్గించడానికి అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తం కాగా.. ఈ ప్రాజెక్టు డిజైన్ ను మార్చడానికి అవకాశం లేదని జలసంఘం అధికారులు స్పష్టం చేసినట్లు విశ్వ సనీయ సమాచారం.

ఇదీ చదవండి:జంబో సైజులో పట్టభద్రుల బ్యాలెట్ పత్రం!

ABOUT THE AUTHOR

...view details