దుబాయ్.. పాకిస్థాన్ దేశాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కొన్ని అనుమానాస్పద ఫోన్‌కాల్స్‌పై కేంద్ర నిఘావర్గాలు దృష్టి కేంద్రీకరించాయి. ఇంటర్నెట్ ఫోన్లను రూట్కాలింగ్కు అనుసంధానించి సంభాషణలు కొనసాగిస్తున్నారని, సమాంతర టెలిఫోన్ ఎక్ఛేంజీల్లా ఉన్న వీటిని ఘరానా నేరస్థులు వినియోగిస్తున్నారని గుర్తించాయి.
రూట్ కాలింగ్ కేంద్రం నిర్వహిస్తూ గత నెలలో దిల్లీలో పట్టుబడిన నలుగురు నిందితులు.. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోనూ ఇలాంటి కేంద్రాలున్నాయని విచారణలో వెల్లడించడంతో ఆయా నగరాల పోలీసులకు సమాచారం అందించాయి. ఉగ్ర సంస్థలతో సంభాషిస్తున్నారా? మరేదైనా జరుగుతోందా? అనే విషయమై దర్యాప్తు చేపట్టాలంటూ ఆదేశించాయి.
వాట్సప్ ఉన్నా..ఇంటర్నెట్ ఫోన్లు ఎందుకు?
జూన్ నెలలో బెంగళూరులోని భారత సైన్యాధికారులతో పాకిస్థాన్‌కు చెందిన ఓ గూఢచారి మాట్లాడారు. సంభాషణలు అనుమానాస్పదంగా ఉండటంతో మిలటరీ నిఘా వర్గాలు రంగంలోకి దిగి గుట్టురట్టు చేశాయి. నిఘా వర్గాల సమాచారంతో ముంబయి పోలీసులు రూట్ కాలింగ్ కేంద్రాలపై దృష్టి కేంద్రీకరించారు. ముంబయి నుంచి పాకిస్థాన్, దుబాయ్‌కి ఎక్కువగా ఫోన్లు వెళ్తూ, వస్తున్నట్టు గుర్తించారు.