దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది నిజమైన ఆత్మ నిర్బర్ భారత్ కావాలంటే మౌలిక వసతుల కల్పనే మార్గమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ దిశగా రాష్ట్రంలో చేపడుతున్న భారీ పారిశ్రామిక పార్కులకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని కోరారు. రాష్ట్రంలో ఫార్మా సిటీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, మెడికల్ డివైస్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వీటికి జాతీయ ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో కేంద్రం సహకరించాలని కోరారు.
కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రాల పరిశ్రమల శాఖ మంత్రులతో నిర్వహించిన 'వన్ డిస్ట్రిక్ - వన్ ప్రొడక్ట్' కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. హైదరాబాద్ దేశ బల్క్ డ్రగ్ క్యాపిటల్‌గా మారటంతో పాటు ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్‌గా మారిందన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగంలో మరింత అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని.. ఆ దిశగా వాటిని అందిపుచ్చుకునేలా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని తెలిపారు.