తెలంగాణ

telangana

స్ఫూర్తిపథంలో 'సాగు'దాం.. మహిళా రైతుల విజయకేతనం!

రైతు లోకానికే ఆదర్శంగా నిలిచారీ మహిళామణులు. దేశవ్యాప్తంగా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో రాణిస్తున్న 51 మంది స్ఫూర్తిదాయక మహిళా రైతులు, వారి విజయగాథలతో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ ఒక పుస్తకం రూపొందించింది. దీనిని ఈ నెల 15న మహిళా రైతు దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది. ఏపీకి చెందిన ఇద్దరికి ఇందులో స్థానం దక్కింది. కడప జిల్లా పులివెందుల మండలం కేవీపల్లి రైతు కాంతమ్మ వినూత్న పద్ధతిలో కంది సాగు చేపట్టి ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో లలితారెడ్డి తేనెటీగల పెంపకం ద్వారా ఏడాదికి రూ.1,18,400 అదనపు ఆదాయం పొందారు.

By

Published : Oct 19, 2020, 12:32 PM IST

Published : Oct 19, 2020, 12:32 PM IST

central-govt-release-book-on-women-farmers
ఏపీ: స్ఫూర్తిపథంలో 'సాగు'దాం.. మహిళా రైతుల విజయకేతనాలు!

పండ్లతోటలు ఎక్కువగా ఉండే ప్రాంతం తేనెటీగల పెంపకానికి అనువని పత్రికల్లో చదివి ఆ దిశగా సాగినట్లు ఏపీ తాడేపల్లిగూడెం రైతు లలితారెడ్డి చెప్పారు. ‘మాకు 15 ఎకరాల పొలం ఉంది. వరి, చెరకుతోపాటు కొబ్బరి, మామిడిని సేంద్రియ విధానంలో సాగు చేస్తాం. పొలం చుట్టూ జామ, అరటి, కొబ్బరితోటలు ఎక్కువ కావడం వల్ల తేనెటీగల పెంపకం చేపట్టాలని భావించాం. కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ తీసుకున్నా’ అని వివరించారు.

2016లో ప్రభుత్వం ఒక యూనిట్‌ (8 పెట్టెలు) మంజూరు చేసిందని, రాయితీపోను రూ.22 వేల వరకు ఖర్చయిందని, తర్వాత రెండో యూనిట్‌నూ ప్రారంభించినట్లు చెప్పారు. కిలో తేనెకు రూ.300 ధర లభిస్తోందని, ఏడాదికి రూ.1,18,400 చొప్పున ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. సేద్య విధానాలపై ఫిలిప్పైన్స్‌లో నిర్వహించిన సదస్సుకు, ఒడిశాలో పలు కార్యక్రమాలకూ హాజరయ్యారు.

కంది మొక్కలు నాటి...

వ్యవసాయంలో కొత్తగా ఏదైనా చేయాలని కడప జిల్లా పులివెందుల మండలం కేవీపల్లి రైతు దంపతులు కాంతమ్మ, రామిరెడ్డి ఆలోచించారు. వ్యవసాయాధికారి మధుసూదన్‌రెడ్డి సలహాతో.. వినూత్న పద్ధతిలో కంది సాగు చేపట్టారు. 2017లో పాలిథీన్‌ సంచుల్లో మట్టి, వానపాముల ఎరువుల్ని నింపి కంది విత్తులు నాటారు. మొక్కలకు 30 రోజుల వయసు వచ్చాక.. వాటిని సాలుకు సాలుకు మధ్య ఆరు అడుగులు, మొక్కకు మొక్కకు మధ్య రెండు అడుగుల దూరంతో పొలంలో నాటారు.

సిఫారసు మేరకు ఎరువులు, తదితరాలను అందించారు. మొక్కలు పెంచి, నాటే పద్ధతిలో ఎకరాకు రూ.15 వేల వరకు ఖర్చయింది. దిగుబడి 10 క్వింటాళ్ల వరకు లభించింది. ఎకరాకు రూ.50 వేల వరకు ఆదాయం సాధించారు. అదే సాధారణ సాగు పద్ధతిలో(విత్తనం వేసే విధానం)లో ఎకరాకు రూ.12 వేలకు పైగా పెట్టుబడి పెడితే గరిష్ఠంగా 4 క్వింటాళ్ల ఆదాయమే లభించింది. తన పొలంలో కంది దిగుబడిని కళ్లారా చూసుకోకుండానే కాంతమ్మ వృద్ధాప్యం కారణంగా మరణించారు.

ఇదీ చదవండి:రైతుకు సాయం.. యువతకు ఆదాయం!

ABOUT THE AUTHOR

...view details