తెలంగాణ

telangana

ETV Bharat / state

Constituencies bifurcation: తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడంటే? - 2026 జనగణన

రాజకీయ ఆశావహులకు కేంద్రం చేదువార్త వినిపించింది. 2026 తర్వాతి జనగణన అనంతరమే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఉంటుందని పార్లమెంటులో తేల్చిచెప్పింది. ఆ అంచనాల ప్రకారం కేంద్ర హోం శాఖ ఆ లెక్కన 2039 వరకు వేచి చూడాల్సిందేనని సంకేతాలిచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అప్పుడే చేపడతామని కేంద్ర హోం శాఖ తాజాగా ప్రకటించింది.

MLA SEATS
MLA SEATS

By

Published : Aug 4, 2021, 4:53 AM IST

Updated : Aug 4, 2021, 10:08 AM IST

రాజకీయ ఆశావహులపై కేంద్రం నీళ్లు చల్లింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2026 తరువాతే చేపడతామని కేంద్ర హోం శాఖ తాజాగా ప్రకటించింది. దీని ప్రకారం, 2039 ఎన్నికల వరకూ అది సాకారమయ్యే అవకాశం కనిపించడంలేదు. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచుతున్నారా? అని మంగళవారం లోక్‌సభలో ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. ‘విభజన చట్టంలోని సెక్షన్‌ 15 ప్రభావంతో సంబంధం లేకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170లోని నిబంధనలను అనుసరించి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కి, తెలంగాణ సీట్లు 119 నుంచి 153కి పెంచాలని విభజనచట్టంలోని సెక్షన్‌ 26 (1) చెబుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 179(3)ని అనుసరించి 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల అనంతరమే రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సర్దుబాటు జరుగుతుంది’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశంలో తమిళనాడు సహా మరే రాష్ట్ర విభజన ప్రతిపాదన తమ వద్ద లేదని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

రాజకీయ ఆశావహులకు అశనిపాతమే
దేశంలో ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కల సేకరణ చేపడతారు. 2021 తర్వాత జనగణన జరిగేది 2031లోనే. 2026 తర్వాత అంటే 2031లో చేపట్టే జనగణన వివరాలు ప్రచురించిన తర్వాతే పునర్విభజన చేపట్టనున్నట్లు స్పష్టమవుతోంది. జమ్మూ-కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించిన కేంద్రం అక్కడ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఇటీవల చేపట్టింది. ప్రస్తుతం ఉన్న 83 అసెంబ్లీ స్థానాలను 90కి పెంచాలని నిర్ణయించింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పునర్విభజన మొదలవుతుందని అన్ని పార్టీలు ఆశించాయి. కేంద్రం తాజా ప్రకటనతో వాటి ఆశలు అడియాసలయ్యాయి. కొత్త నియోజకవర్గాల కోసం 2039లో జరిగే సార్వత్రిక ఎన్నికల వరకు ఎదురుచూడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. గతంలో 2001 జనాభా లెక్కల ప్రకారం చేపట్టిన పునర్విభజన ప్రక్రియ ఏడేళ్ల తర్వాత 2008లో పూర్తయింది. 2009 ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాలు అమలులోకి వచ్చాయి. కేంద్రం తాజా ప్రకటన మేరకు 2031లో చేపట్టే జనగణన వివరాలు ప్రచురితం కావడానికి రెండు, మూడేళ్లు పడుతుంది. ఆ తర్వాతే పునర్విభజన ప్రతిపాదనలు పట్టాలెక్కుతాయి. గతానుభవాలను బట్టి చూస్తే, 2039 ఎన్నికల నాటికి మాత్రమే కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి రావచ్చన్నది రాజకీయ వర్గాల అంచనా. అప్పటికి కేంద్రంలో అధికారంలో ఉండే ప్రభుత్వ వైఖరిని బట్టి కూడా ఇది ఆధారపడి ఉంటుంది.

ఇది రాజ్యాంగ విరుద్ధం- మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి

మ్మూ-కశ్మీరుకు ఒక న్యాయం, రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక న్యాయం అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వ్యవహారాల మాజీ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి విమర్శించారు. ‘370 ఆర్టికల్‌ను తొలగించిన తరువాత కశ్మీరులో వేరే చట్టాలు లేవు. భారత రాజ్యాంగమే ప్రామాణికం. రాజ్యాంగం ప్రకారం అక్కడ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే తెలుగు రాష్ట్రాల్లోనూ చేయాలి. తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం కూడా రాజ్యాంగ విరుద్ధమే. ఆయా అంశాలపై న్యాయపోరాటం చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

KRMB: ఎల్లుండి రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించనున్న కృష్ణాబోర్డు ప్రతినిధులు

Last Updated : Aug 4, 2021, 10:08 AM IST

ABOUT THE AUTHOR

...view details