ఉద్యోగావకాశాలను పెంచేందుకు తోడ్పడాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం కొత్త ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా విద్యార్థులకు ఆకర్షణీయ నగరాలు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. ‘ద అర్బన్ లర్నింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్’ లేదా తులిప్ (TULIP) గా దీనికి పేరు పెట్టారు. ప్రస్తుతం 23,970 సంస్థల్లో దాదాపు మూడు లక్షల ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ పరిచయమున్నదే. నిజానికి ఇది వారికి తప్పనిసరి కూడా. పుస్తక పరిజ్ఞానాన్ని విధి నిర్వహణలో ఎలా ఉపయోగించాలో తెలుసుకునే మార్గమే ఇంటర్న్‌షిప్. ఇది పని గురించిన అవగాహనను కల్పించడంతోపాటు మెరుగైన అవకాశాలనూ అందిస్తుంది. ఈ అవకాశాలను గ్రాడ్యుయేట్లకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. తులిప్ పోర్టల్‌లో దేశవ్యాప్తంగా ఉన్న అవకాశాలను ఒకేచోట అందుబాటులో ఉంచుతారు. ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, లా, సైన్స్, కామర్స్/ ఆర్ట్స్ విభాగాల్లో అభ్యర్థి తన రంగానికి సంబంధించిన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఎంచుకోవచ్చు. ఇంటర్న్‌షిప్‌ల వ్యవధి ఎంచుకున్న ప్రాజెక్టును బట్టి మారుతుంది. సాధారణంగా 8 వారాల పరిధి నుంచి ఏడాది వరకూ ఉంటుంది.
ఏవిధంగా ఉపయోగం?
వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్నవారు అర్బన్, స్మార్ట్ సిటీ పరిధిలోని ప్రాజెక్టుల్లో ఇంటర్న్‌లుగా పనిచేస్తారు. అర్బన్ ప్లానింగ్, అర్బన్ డిజైనింగ్, వివిధ ఇంజినీరింగ్ బ్రాంచిలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మొబిలిటీ, ఫైనాన్స్, సోషల్ సెక్టార్, పర్యావరణ సమస్యలు సహా ఇతర ఎన్నో విభాగాల్లో అవగాహన కల్పించుకునే అవకాశం లభిస్తుంది. తులిప్ ఇంటర్న్‌లకు విధానాల రూపకల్పన, అమలు అంశాల్లోనూ అవగాహన కల్పిస్తారు. నగర అధికారులు, సంబంధిత వ్యక్తులతో రోజువారీ కార్యకలాపాలకు సంబంధించి సంప్రదింపులు జరిగే అవకాశం లభిస్తుంది. పాటించాల్సిన పద్ధతులు, ఆలోచనలను పంచుకోవడం, ప్రారంభ స్థాయిలో ప్రాజెక్టును అమలుపరచడం వంటి అంశాల్లో పాల్గొనవచ్చు. ఇంటర్న్‌షిప్ పూర్తయ్యేనాటికి నగర పరిపాలనలో భవిష్యత్‌కు అవసరమైన అనేక అంశాలపై పట్టు ఏర్పరచుకునే అవకాశం లభిస్తుంది.
ఎవరు అర్హులు?
భారతీయులై ఉండాలి. గ్రాడ్యుయేషన్ స్థాయిలో.. బి.ప్లాన్, బీటెక్, బి.ఆర్క్, బీఏ, బీఎస్‌సీ, బీకాం, బీబీఏ, బీసీఏ, ఎల్‌ఎల్‌బీ తత్సమాన విద్యను పూర్తిచేసినవారు అర్హులు. గ్రాడ్యుయేషన్ పూర్తయి 18 నెలలలోపైవుంటే వారూ దరఖాస్తు చేసుకోవచ్చు.