Singareni Coal Mines : తెలంగాణలోని మూడు కొత్త బొగ్గు గనులను సింగరేణికి పాతపద్ధతిలో అప్పగించడానికి కేంద్రం ససేమిరా అంటోంది. తాజాగా దేశవ్యాప్తంగా వేలానికి పెట్టిన 133 బొగ్గు గనుల్లో, రాష్ట్రంలోని ఆ మూడింటితోపాటు.. సింగరేణి వద్దని వదిలేసిన మరో గని ఉన్నాయి. ఈ 4 గనుల్లో 30.87 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలున్నాయని తెలిపింది. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 26లోగా టెండర్లు దాఖలు చేసి వేలంలో దక్కించుకోవచ్చని కేంద్ర బొగ్గు శాఖ జారీచేసిన తాజా టెండరు నోటిఫికేషన్‌లో ప్రకటించింది.
central on Singareni Coal Mines : ఈ జాబితాలో తెలంగాణలోని పెనగడప, శ్రావణపల్లి, సత్తుపల్లి బ్లాక్-3, కల్యాణఖని బ్లాక్-6 ఉన్నాయి. పెనగడప గనిలో నాణ్యత అంతగా లేని జీ13 గ్రేడ్ బొగ్గు వస్తుందని, సింగరేణి సంస్థనే దీనిని వేలానికి అప్పగించినట్లు కేంద్ర బొగ్గు శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక మిగిలిన 3 గనులను వేలంలో పెట్టకుండా నేరుగా తమకే అప్పగించాలని సింగరేణి సంస్థ కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. ఈ గనులు సింగరేణికి ఇప్పటికే ఉన్న పాత గనులను ఆనుకుని ఉన్నాయి.
బొగ్గు గనుల వేలం విధానం అమల్లోకి వచ్చాక.. ఇది ఆరో నోటిఫికేషన్. శ్రావణపల్లి, సత్తుపల్లి బ్లాక్-3, కల్యాణఖని బ్లాక్-6, కోయగూడెం గనులు గత రెండు టెండర్ నోటిఫికేషన్లలోనూ ఉన్నాయి. అప్పట్లో కోయగూడెం గనికి మాత్రమే తెలంగాణకు చెందిన ‘ఆరో కోల్’ కంపెనీ టెండరు వేసి దక్కించుకుంది. మిగిలిన మూడు గనులకు ఒక్క టెండరూ రాలేదు. ఈ నేపథ్యంలో వాటిని కేంద్రం తమకే అప్పగిస్తుందని సింగరేణి ఇంతకాలం ఎదురుచూసింది. కానీ ఈ సంస్థ అంచనాలను తలకిందులు చేస్తూ తాజాగా జారీచేసిన నోటిఫికేషన్‌లో ఆ మూడింటితో పాటు పెనగడపను చేర్చింది.