ఆర్టీసీ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తెలంగాణ ఆర్టీసీకి తమ అనుమతి లేదని... దానికి చట్టబద్ధతే లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి ధర్మాసనం ఎదుట అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వానికి ఏపీఎస్ఆర్టీసీలో 33 శాతం వాటా ఉన్నది నిజమేనని.. అయితే అది టీఎస్ఆర్టీసీకి బదిలీ కావన్నారు. ఏపీఎస్ఆర్టీసీ విభజన ప్రక్రియ పూర్తికానందున... టీఎస్ఆర్టీసీలో 33 శాతం వాటా ఉందన్న ప్రశ్నే తలెత్తదని కేంద్రం పేర్కొంది.
ఆర్టీసీకి కేంద్రం ఆమోదం లేదు...
ఏపీఎస్ఆర్టీసీ విభజన కోసం కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరలేదని రాజేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి కేంద్రం ఆమోదం లేదని వాదించారు. ఆస్తులు, అప్పుల విభజన అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వివరించారు. విభజన ప్రక్రియ పూర్తికావడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉన్నందున... పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ తరఫు న్యాయవాదులు వివరించారు.