తెలంగాణ

telangana

ETV Bharat / state

Central Government: బియ్యం సేకరణపై కేంద్రం తాజా మెలిక... నష్టపోతామంటున్న రైతులు

తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం దిగుబడి ఏడాదికేడాది పెరుగుతోంది. దాదాపు 90 శాతానికి పైగా ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మారుస్తుంటారు. ఇక్కడ నుంచే కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల కోసం గతంలో ఎఫ్​సీఐ కొనేది. కానీ ప్రస్తుతం ఆ కొనుగోళ్లు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం సైతం పరిమిత మోతాదులో కొంటామని... వచ్చే ఏడాది అసలు కొనలేమని కూడా తేల్చి చెప్పింది. ఈ పరిణామంతో రైతులు కంగుతింటున్నారు. తాము తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు.

rice-collection
బియ్యం సేకరణపై కేంద్రం తాజా మెలిక

By

Published : Sep 8, 2021, 6:59 AM IST

ఏడాదికేడాదికి ధాన్యం దిగుబడి గణనీయంగా పెరుగుతోంది. ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లలోనూ ఉత్పత్తయ్యేదానిలో దాదాపు 90 శాతానికి పైగా ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మారుస్తుంటారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రలో తయారయ్యే ఉప్పుడు బియ్యాన్ని కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ప్రజాపంపిణీ వ్యవస్థ కోసం గతంలో ఎఫ్‌సీఐ కొనేది. రెండేళ్లుగా ఇక్కడ దిగుబడులు రెట్టింపయ్యాయి. ఇతర రాష్ట్రాల్లోనూ స్థానికంగా ఉత్పత్తి కొంత పెరిగింది. ఫలితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి ఎఫ్‌సీఐ కొనుగోళ్లు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. గతంతో పోలిస్తే సగానికి సగం కూడా కొనడం సాధ్యం కాదని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) తేల్చిచెప్పడం రైతులకు శరాఘాతంగా మారింది. 2018-19 రబీలో 37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే 2019-20లో ఇది 64 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరింది. ఈ ఏడాది 92 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొన్నది. గత ఏడాది 39.33 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యం వస్తే, ఈ ఏడాది సుమారు 62 లక్షల మెట్రిక్‌ టన్నులు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది మే 25న రాసిన లేఖలో 24.75 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యం మాత్రమే కొంటామని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది అసలు కొనలేమని కూడా తెల్చిచెప్పింది ఈ పరిణామం రానున్న రోజుల్లో కొత్త సమస్యలను దారితీసే అవకాశం ఉంది. ఉప్పుడు బియ్యంగా మార్చి 100 కేజీల ధాన్యాన్ని మిల్లింగ్‌ చేస్తే 68 కేజీల వరకు బియ్యం వస్తుంది. అదే సాధారణ బియ్యం అయితే వాతావరణ పరిస్థితులను బట్టి 40 నుంచి 50 శాతం వరకు నూకలు వస్తాయని అంచనా.

రైతుకు అనుకూలమనే..

సన్నరకం (బీపీటీ) కంటే దొడ్డురకం (ఎంటీయు 1010) నారు మడి నుంచి రైతుకు అనుకూలమే. సన్నాలు నారు పోశాక 25 నుంచి 30 రోజుల్లోగా నాట్లు వేయాలి. లేదంటే ముదిరిపోతుంది. పంట కాలం 135 రోజులు. దోమపోటు ఎక్కువ. మందులు ఎక్కువ వాడాలి. దొడ్డురకం నారు 35 నుంచి 40 రోజులైనా ఫర్వాలేదు. పంటకాలం 110 నుంచి 120 రోజులే. దోమపోటు తక్కువ. మందులు తక్కువ అవసరపడతాయి. నీరు తక్కువున్నా నెట్టుకొస్తుంది. పదేళ్ల క్రితం వరకు సన్నాల ధర దొడ్డు బియ్యం కంటే రూ.300 వరకు ఎక్కువ ఉండేది. ప్రభుత్వం కొనడం మొదలుపెట్టాక దొడ్డురకం ధరే కొంత ఎక్కువగా ఉందని ఓ మిల్లర్‌ తెలిపారు. నిజానికి పోషకాలపరంగా చూస్తే రెండింటి గుణగణాలు రెండూ ఒకటే అని మాజీ వైస్‌ ఛాన్సలర్‌, వ్యవసాయ విశ్వవిద్యాలయం రాఘవరెడ్డి తెలిపారు. బియ్యం గింజ పొడవు, వెడల్పు నిష్పత్తిని బట్టి కామన్‌, ఫైన్‌, సూపర్‌ ఫైన్‌గా నిర్ణయిస్తారని చెప్పారు. దొడ్డు బియ్యం వండినపుడు గంజి కట్టినట్లు ఉంటే, సన్నబియ్యం అన్నం పొడిపొడిగా ఉంటుందని.. అందుకే చాలామంది సన్నబియ్యం వైపు మొగ్గుతారని వివరించారు.

ఉప్పుడు బియ్యమే ఎందుకు?

ఏటా వానలు ఆలస్యం కావడం, రిజర్వాయర్లు సకాలంలో నిండకపోవటంతో ఖరీఫ్‌ సాగు జాప్యమవుతోంది. ఫలితంగా రబీ కూడా ఆలస్యమవుతోంది. పంట చివరి దశకు వచ్చేటప్పటికి ఉష్ణోగ్రతలు పెరిగి ఎండ తీవ్రత ఎక్కువవుతుంది. దీంతో గింజ పెళుసుగా మారి మిల్లులో ఆడించినప్పుడు నూక ఎక్కువగా వస్తుంది. వంద కేజీల ధాన్యం మిల్లింగ్‌ చేస్తే 40 నుంచి 50 శాతం నూక వస్తుందని మిల్లర్లు తెలిపారు. దీంతో ఉప్పుడు బియ్యంగా మార్చి అమ్మడం ప్రారంభించారు. దీనికైతే 100 కేజీల ధాన్యానికి 68 కేజీల వరకు బియ్యం వస్తాయి. కేరళ, తమిళనాడు సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఉప్పుడు బియ్యం వాడకం ఎక్కువ. దీంతో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) తమిళనాడు, కేరళల్లో ప్రజా పంపిణీ అవసరాల కోసం తెలంగాణ, ఏపీల నుంచి ఉప్పుడు బియ్యాన్ని కొనేది. ఏటా 25 నుంచి 30 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసేది. దక్షిణాఫ్రికా తదితర దేశాలకు కొంత ఎగుమతి చేసేవారు.

ఎగుమతుల్ని ప్రోత్సహించాలి

తంలో ఎఫ్‌సీఐ బఫర్‌ స్టాక్‌ పెట్టుకొనేది. ఇప్పుడు అది తీసేసింది. మిల్లుల్లో నిల్వలు పేరుకుపోతే తర్వాత కొనడం కష్టమవుతుంది. పాత స్టాకే పోలేదు, కొత్తదేం చేస్తామంటారు. మిల్లర్లు తీసుకోకపోతే రైతుకు తీవ్రనష్టం. వారికి ఏం చేయాలో తెలియక రోడ్డు మీదకు వస్తారు. రానున్న రోజుల్లో ఈ సమస్య తీవ్రమవుతుంది. కాకినాడలో పోర్టు ఉంది కాబట్టి అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేయడానికి రవాణా ఛార్జీలు పడవు. అదే నిజామాబాద్‌ నుంచి కాకినాడ తీసుకెళ్లి ఎగుమతి చేయాలంటే రవాణా ఛార్జీలే క్వింటాలుకు రూ.200 పడతాయి. అలాంటప్పుడు కేంద్రం రవాణా సబ్సిడీ ఇస్తే కొంత ఉపయోగంగా ఉంటుంది. ఎగుమతులు ప్రోత్సహించడానికి ప్రత్యేక విధానం అవసరం. అంతర్జాతీయ మార్కెట్‌ ధరకు తగ్గట్లు మన ఎగుమతి ధర ఉండాలి. మన అవసరాలకు ఎంత కావాలో ఉంచుకుని మిగిలింది ఎగుమతి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక వేయాలి.

-మోహన్‌రెడ్డి, తెలంగాణ రైస్‌ మిల్లర్ల సంఘం ప్రధాన కార్యదర్శి

ఎక్కువ ధాన్యం వస్తుంది

డాదికేడాది ధాన్యం ఎక్కువగా వస్తోంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 25 శాతం అదనంగా మిల్లింగ్‌కు వచ్చాయి. ఉప్పుడు బియ్యం వద్దంటే చాలా నష్టం వస్తుంది. కాబట్టి సమస్యను ఎలా పరిష్కరించాలో ప్రభుత్వాలు ఆలోచించాలి తప్ప కొనేది లేదని చెప్పడం సరికాదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఇడ్లీ కోసం తప్ప దేనికీ ఉప్పుడు బియ్యం వాడరు.

-జనార్దన్‌రావు, మిల్లర్‌ మిర్యాలగూడ

సమస్య ఏమిటి?

ప్పుడు తెలంగాణలో వరి సాగు పెరిగింది. ఉప్పుడు బియ్యం ఉత్పత్తి పెరిగింది. తమిళనాడు, కేరళలోనూ కొంత ఉత్పత్తి పెరగడం వల్ల అక్కడి అవసరాల కోసం ఎఫ్‌సీఐ కొనుగోళ్లు తగ్గించింది. గతంలో తమిళనాడు ప్రజాపంపిణీ వ్యవస్థ మన మీద ఆధారపడి ఉండేది. ఆ రాష్ట్రంలో 6 నుంచి 8 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించగా మిగతాది ఎఫ్‌సీఐ మన దగ్గర నుంచి సేకరించేది. ఇప్పుడు తమిళనాడులోనే 23 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించింది. వచ్చే ఏడాది 45 లక్షల మెట్రిక్‌ టన్నులు అక్కడే వస్తుందని అంచనా. అప్పుడు ఇక మన దగ్గర నుంచి దిగుమతి చేసుకునే అవసరం ఉండదు.

కేరళలో కూడా కొంత ఉత్పత్తి పెరిగింది. 10 లక్షల మెట్రిక్‌ టన్నులు పీడీఎస్‌ కింద అవసరమైతే ఇప్పుడు 2 నుంచి 3 లక్షల మెట్రిక్‌ టన్నులు అక్కడే దొరుకుతోంది. ప్రజాపంపిణీ కోసం ఎక్కడికక్కడ ధాన్యం సేకరించడం వల్ల రవాణా ఛార్జీలు తగ్గుతాయని ఎఫ్‌సీఐ భావిస్తోంది.

ఇదీ చూడండి:KRMB LETTER: 'వసతి, సౌకర్యాల పూర్తి వివరాలను వీలైనంత త్వరగా పంపాలి'

ABOUT THE AUTHOR

...view details