ఓ ప్రధాన రహదారి.. పక్కనే ప్రధాన కూడలి.. దీన్ని ఆనుకొనే కేంద్ర అణు ఇంధన సంస్థ(ఎన్‌ఎఫ్‌సీ)కి చెందిన ఓ స్థలం. విస్తీర్ణం దాదాపు 5 ఎకరాలు.. విలువ రూ.200 కోట్లు. ఈ భూమిపై కొన్నేళ్ల క్రితం ఓ వ్యక్తి కన్ను పడింది. ఐదేళ్ల క్రితం ఆధ్యాత్మికత ముసుగులో అక్కడ అడుగుపడింది. అంతే.. ఆ తర్వాత ఒక్కో నిర్మాణం.. తాత్కాలికంగా నిర్మిస్తున్నామంటూనే శాశ్వత నిర్మాణాలు వెలిశాయి. పలు ఆధ్యాత్మిక కేంద్రాలూ, విగ్రహాలూ పుట్టుకొచ్చాయి. కేంద్ర సర్కారు తేరుకొని ఈ భూమి మాదేనని గుర్తించేలోపే.. జిల్లా యంత్రాంగం చేరుకునేలోపే అక్కడ ఓ వ్యాపార సామ్రాజ్యం రూపుదిద్దుకుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆగిపోయి ఇప్పుడు వాణిజ్య కార్యకలాపాలు మొదలయ్యాయి. ఎన్ని ఫిర్యాదులొచ్చినా.. ఓ ప్రజాప్రతినిధి, మరో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పేరు చెప్పి బెదిరించి యథేచ్ఛగా దందా నడుస్తోంది. ఇదంతా మల్లాపూర్ పరిధిలోని నెహ్రూనగర్ బస్తీని ఆనుకొని ఉన్నా సర్వే నెంబర్ 43, 44ల్లో ఉన్న భూమి స్వాహా కథ.
సెలవు రోజుల్లోనే నిర్మాణాలు
మా భూముల్ని ఆక్రమిస్తున్నారంటూ ఎన్‌ఎఫ్‌సీ ఉన్నతాధికారులు, సెక్యురిటీ అధికారి మహేశ్ ఆజాద్ రెవెన్యూతో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికీ సమస్యను తీసుకొచ్చారు. అయితే తాత్కాలికంగా నిర్మాణాల్ని ఆపగలుగుతున్నా ఎన్‌ఎఫ్‌సీ సెలవు రోజుల్లో, రాత్రికి రాత్రే నిర్మాణాలు చకచకా జరిగిపోతున్నాయని సెక్యూరిటీ అధికారి ఆజాద్ ‘ఈనాడు’కు తెలిపారు. ఆక్రమణలపై అడిగితే ప్రజాప్రతినిధుల పేర్లుచెప్పి బెదిరిస్తున్నారని.. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని.. కేంద్ర సర్కారు భూముల్ని వదలబోమని ఓ ఉన్నతాధికారి చెప్పారు. అన్నీ తెలిసినా ఏం చేయలేకపోతున్నామని.. ఉన్నతస్థాయి అధికారులు ఆదేశాలుంటేనే కబ్జా అడ్డుకోగలమని ఓ స్థానిక రెవెన్యూ అధికారి తెలిపారు.
ప్రజాప్రతినిధులు, ప్రముఖుల పేర్లతో..
ఈ దందా వెనక ఒక్కరే ఉన్నారని ఇక్కడి స్థానికుల వాదన. ఎవరైనా స్థానికులు ఇదేంటని ప్రశ్నిస్తే మంత్రి ఓ ప్రజాప్రతినిధితోపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తల పేరు చెప్పడంతో పాటు బెదిరిస్తున్నారని చెబుతున్నారు. దీంతో అన్నీ తెలిసినా అధికారులు ఏం చేయలేకపోతున్నారంటున్నారు.
అవి నిషేధిత భూములే..
సర్వే నెం.43,44ల్లో ఉన్నది ఎన్‌ఎఫ్‌సీ భూములేనని నిర్ధారించాం. ఇంధన సంస్థ కాబట్టి అది బఫర్‌జోన్‌గా గుర్తిస్తాం. దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత సంస్థదే. అక్కడ ఎవరూ నిర్మాణాలు చేపట్టొద్ధు గతంలో వీటిపై ఫిర్యాదులు అందితే అడ్డుకున్నాం. ఇప్పుడు కూడా సంస్థ కోరితే వెళ్లి అడ్డుకొని వారికి సాయమందించేందుకు సిద్ధంగా ఉన్నాం. -గౌతమ్‌కుమార్, ఉప్పల్ తహసీల్దార్