మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ పోస్టులకు ఎంపికైనవారు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/ కార్యాలయాల్లో, దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ సంస్థల్లో విధులు నిర్వర్తిస్తారు. హవల్దార్ పోస్టులకు ఎంపికైనవారు కేంద్ర రెవెన్యూ, ఆర్థిక మంత్రిత్వ శాఖలకు అనుబంధంగా పనిచేస్తారు. కేంద్రంలోని పరోక్ష పన్నుల విభాగాలు, నార్కోటిక్ బ్యూరోలో వీరి విధులుంటాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ రెండూ లెవెల్-1 ఉద్యోగాలే. వీరికి రూ.18వేల మూలవేతనం అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అదనంగా దక్కుతాయి. అందువల్ల వీరు రూ.30 వేల వరకు జీతం అందుకోవచ్చు. అనుభవం, శాఖాపరమైన పరీక్షల ద్వారా భవిష్యత్తులో వీరు మెరుగైన స్థాయికి చేరుకోవచ్చు.
ఎంపిక విధానం
ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ పరీక్ష, డిస్క్రిప్టివ్ పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఎంటీఎస్ పోస్టులు భర్తీ చేస్తారు. హవల్దార్ పోస్టులకు అదనంగా పీఈటీ, పీఎస్‌టీలు ఉంటాయి.
‣ పేపర్-1: దీన్ని ఆన్‌లైన్‌లో వంద మార్కుల నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంగ్లిష్, జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల్లో ఒక్కో అంశం నుంచి 25 చొప్పున మొత్తం వంద ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన జవాబుకు పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. ఇందులో అర్హత సాధించడానికి జనరల్ అభ్యర్థులు 30, ఓబీసీ/ఈడబ్ల్యుఎస్‌లు 25, ఇతర విభాగాలవారు 20 మార్కులు పొందడం తప్పనిసరి. ఇలా అర్హుల జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ అనుసరించి కొంత మందిని పేపర్-2 రాయడానికి ఎంపిక చేస్తారు.
‣ పేపర్-2:ఈ పరీక్షను డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు. అభ్యర్థుల్లో భాషా పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి దీన్ని నిర్వహిస్తారు. సమాధానాలు పేపర్‌పై పెన్నుతో రాయాలి. జవాబులు తెలుగులోనూ రాసుకోవచ్చు. యాభై మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. ఇందులో భాగంగా ఒక లేఖ, ఒక వ్యాసం రాయాల్సి ఉంటుంది. ఒక్కో దానికీ 25 చొప్పున మార్కులు కేటాయించారు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. జనరల్ అభ్యర్థులు 20, ఇతర విభాగాలవారు 17.5 మార్కులు పొందితే సరిపోతుంది. ఇందులో సాధించిన మార్కులు తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. అయితే పేపర్-1లో ఇద్దరు అభ్యర్థులు సమాన మార్కులు పొందితే పేపర్-2లో ఎక్కువ మార్కులు వచ్చినవారికి ప్రాధాన్యం ఉంటుంది.
‣ పీఈటీ:హవల్దార్ పోస్టులకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు ఉంటుంది. ఇందులో భాగంగా పురుషులు 1600 మీటర్ల దూరాన్ని 15 నిమిషాల్లో నడవాలి. మహిళలు ఒక కిలోమీటర్‌ని 20 నిమిషాల్లో పూర్తిచేయాలి. అలాగే పురుషులు 8 కి.మీ. దూరాన్ని సైకిల్‌పై అర గంటలో చేరుకోవాలి. మహిళలైతే 3 కి.మీ. దూరాన్ని 25 నిమిషాల్లో చేరాలి.
‣ పీఎస్‌టీ: పురుషులు 157.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఛాతీ విస్తీర్ణం 76 సెం.మీ. తప్పనిసరి. అలాగే ఊపిరి పీల్చినప్పుడు ఇది కనీసం 5 సెం.మీ. పెరగాలి. మహిళలకు 152 సెం.మీ. ఎత్తు, 48 కి.గ్రా. బరువు అవసరం.
ముఖ్య సమాచారం
మొత్తం ఖాళీలు: హవల్దార్ (సీబీఐసీ, సీబీఎన్ విభాగాలు) మొత్తం 3603 ఖాళీలు. ఎంటీఎస్ పోస్టుల ఖాళీల వివరాలు తర్వాత ప్రకటిస్తారు.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత
వయసు: జనవరి 1, 2022 నాటికి ఎంటీఎస్ పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 1997 కంటే ముందు జనవరి 1, 2004 తర్వాత జన్మించినవారు అనర్హులు. హవల్దార్, ఎంటీఎస్‌లో కొన్ని పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల వరకు అవకాశం ఉంది. వీటికి జనవరి 2, 1995 కంటే ముందు, జనవరి 1, 2004 తర్వాత జన్మించినవారు అనర్హులు. అన్ని పోస్టులకూ ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: ఏప్రిల్ 30 రాత్రి 11 గంటల వరకు.
దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలూ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులూ చెల్లించనవసరం లేదు.
పరీక్ష తేదీ: జులైలో పేపర్ 1 నిర్వహిస్తారు. పేపర్ 2 వివరాలు తర్వాత ప్రకటిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:ఏపీలో..చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
వెబ్‌సైట్:https://ssc.nic.in/
ప్రశ్నలడిగే అంశాలు
జనరల్ ఇంగ్లిష్‌కు హైస్కూల్ స్థాయి ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకుంటే ఎక్కువ మార్కులు సాధించడం కష్టమేమీ కాదు.
ప్రశ్నలన్నీ పదో తరగతి పూర్తిచేసుకున్న విద్యార్థి ఎదుర్కునేలా ఉంటాయి. తేలిక, సాధారణ స్థాయిలోనే వీటిని అడుగుతారు. అభ్యర్థి అవగాహనను తెలుసుకునేలా వీటిని రూపొందిస్తారు. సగటు విద్యార్థి ఎక్కువ ప్రశ్నలకు సులువుగానే సమాధానాలు గుర్తించవచ్చు.
‣ జనరల్ ఇంటలిజన్స్ అండ్ రీజనింగ్: నాన్ వెర్బల్ ప్రశ్నలు ఉంటాయి. జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, ఎనాలిసిస్, నంబర్ ఎనాలజీ, పోలికలు, తేడాలు, పరిశీలనలు, సంబంధాలు, నంబర్ క్లాసిఫికేషన్, ఫిగర్ ఎనాలజీ, నంబర్ సిరీస్, కోడింగ్ - డీకోడింగ్, వర్డ్ బిల్డింగ్...మొదలైన విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు సాధించడం ద్వారా వీటికి సమాధానాలు గుర్తించవచ్చు. తర్కంతో ముడిపడే తేలిక ప్రశ్నలే ఉంటాయి.
‣ జనరల్ అవేర్‌నెస్:ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. సాధారణ పరిజ్ఞానంతోనే జవాబులు రాసేయవచ్చు. ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితంతో ముడిపడే ఉంటాయి. పర్యావరణాంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. రోజువారీ సంఘటనలే (వర్తమాన వ్యవహారాలు) ప్రశ్నలుగా వస్తాయి. వీటితోపాటు భారత్- పొరుగు దేశాలు, చరిత్ర, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, సైన్స్ అంశాల నుంచీ ప్రశ్నలు ఉంటాయి. హైస్కూల్ సోషల్, సైన్స్ పాఠ్యపుస్తకాలు బాగా చదువుకుంటే సరిపోతుంది. వర్తమాన వ్యవహాల ప్రశ్నలు ఎదుర్కోవడానికి జులై 2021 నుంచి ముఖ్యాంశాలను మననం చేసుకోవాలి.