ధాన్యం, బియ్యం గింజల ప్రమాణాల విషయంలో కేంద్రం వెనక్కు తగ్గింది(central government has not changed to the grain and rice standards). మునుపటి ప్రమాణాలే ప్రస్తుత వానాకాలంలోనూ అమలులో ఉంటాయని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలకు నాణ్యమైన బియ్యం అందజేసేందుకు ప్రస్తుతం అమలులో ఉన్న ప్రమాణాల్లో మార్పులు చేస్తూ కేంద్రం గడిచిన నెలలో రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. వీటివల్ల ఇటు రైతులు, అటు మిల్లర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి (pm modi) పంజాబ్ అప్పటి ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ లేఖ కూడా రాశారు. తెలంగాణ ప్రభుత్వం సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది.
తేమ 17 శాతమే
తాజాగా క్వింటా ధాన్యంలో తేమ 17 శాతం వరకు అనుమతిస్తున్నట్లు కేంద్రం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ధాన్యంలో తాలును రెండు శాతం వరకు అనుమతించింది. బియ్యంలో నూకలు కూడా 25 శాతం వరకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ‘గతంలో జారీ చేసిన ఉత్తర్వులను కేంద్రం ఉపసంహరించుకోవటంతో రైతులకు మేలు జరుగుతుంది’ అని తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంపా నాగేందర్ సంతృప్తి వ్యక్తం చేశారు.