కేంద్ర ప్రభుత్వం అనుమతించిన రెండు కొవిడ్ టీకాలు సురక్షితమైనవేనని కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు ఆచార్య కె.విజయరాఘవన్ స్పష్టం చేశారు. టీకాల సమర్థతకూ ఎటువంటి ఢోకా లేదన్నారు. అన్ని రకాల పరిశోధనల ఫలితాలను విశ్లేషించిన తర్వాతే కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులిచ్చిందని తెలిపారు. టీకాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచ దేశాల్లో ముందు వరుసలో ఉందనీ, ఇతర దేశాల్లో వినియోగించే టీకాల్లో ప్రతి మూడింటిలో ఒకటి భారత్ ఉత్పత్తి కావడం విశేషమని ఆయన చెప్పారు. ‘భారత్‌లో టీకా అభివృద్ధి’ అనే అంశంపై గురువారం అస్కీ ఛైర్మన్ కె.పద్మనాభయ్య అధ్యక్షతన జరిగిన వెబినార్‌లో కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు ఆచార్య కె.విజయరాఘవన్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
మరణాలు సంభవిస్తాయని భావించడం అపోహే
కొవిడ్ కొత్త వ్యాధి. టీకా కూడా కొత్తగా అందుబాటులోకి వచ్చిందే. ఇటువంటప్పుడు కొంత భయాందోళనలు సహజమే. అయితే ఒక్కటి గుర్తుంచుకోవాలి.. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే అనుమతులిచ్చింది. తీవ్ర దుష్ఫలితాలు వస్తాయని.. మరణాలు సంభవిస్తాయని భావించడం అపోహే. టీకా పొందిన తర్వాత మరణించినంత మాత్రాన.. టీకానే కారణమని అనుకోవడం సరైంది కాదు. రోజూ అల్పాహారం తీసుకుంటాం. ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత గుండెపోటు వచ్చి చనిపోతే.. దానికి కారణం అల్పాహారమని అనుకుంటే ఎలా? కచ్చితంగా కారణాలను అన్వేషించాలి. అయినా ప్రతి దుష్ఫలితంపైనా లోతుగా విశ్లేషణాత్మక ప్రయోగాలు జరుగుతున్నాయి.
యువతపై కొవిడ్ తీవ్రత తక్కువ
వైద్యసిబ్బంది, రెవెన్యూ, పోలీసు, పురపాలక తదితర పోరాట యోధులకు టీకాలివ్వడం పూర్తయ్యాక 50 ఏళ్ల పైబడినవారికి, ఆ లోపు వయసులో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకాలను అందజేస్తారు. ఆసమయంలో కొవిన్‌యాప్ ఆండ్రాయిడ్, ఆపిల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. అప్పుడు ఎవరికి వారు స్వీయ నమోదు చేసుకోవచ్చు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్య కోసం ఎక్కువగా బయటకొచ్చే యువతకు ముందుగా టీకాలను ఇవ్వచ్చు కదా.. అని కొందరు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. ఎవరికి ముందుగా ఇవ్వాలనే విషయంలో పెద్ద అధ్యయనమే జరిగింది. యువత ఎక్కువగా వైరస్ బారినపడుతున్నా.. వారిపై కొవిడ్ తీవ్రత తక్కువ. వారికి తెలియకుండానే వచ్చి, తగ్గిపోయి ఉంటుంది. అదే 50 ఏళ్ల పైబడినవారిలో తీవ్రత అధికంగా ఉంది. మొత్తం కొవిడ్ మరణాల్లో వీరి సంఖ్య దాదాపు 70 శాతం దాటింది. అందుకే 50 ఏళ్ల పైబడిన వారికి ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది.
మున్ముందు ఒకే డోసు ఇచ్చేలా ప్రయోగాలు