ఏపీ రాష్ట్రవ్యాప్తంగా భూ రికార్డుల ప్రక్షాళన కోసం భూముల రీసర్వే ప్రక్రియను చేపట్టనున్నట్టు ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భూ వివాదాలు సమసిపోతాయని భావిస్తున్నట్టు తెలిపారు. సచివాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. భూముల రీసర్వే ప్రక్రియను పటిష్ఠంగా నిర్వహించేందుకు అవసరమైన అంశాలపై చర్చించారు.
డిసెంబరు 21న కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ఏపీ ముఖ్యమంత్రి భూముల రీసర్వే ప్రక్రియను ప్రారంభించనున్నట్టు మంత్రి ధర్మాన తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ రీసర్వే చేపడుతున్నట్టు వెల్లడించారు. గతంలో భూ భారతి పేరిట రీసర్వే మొదలు పెట్టినా సఫలం కాలేదన్నారు. ప్రస్తుతం సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం17,466 గ్రామాల్లో 2 కోట్ల 26 లక్షల ఎకరాల స్థలాన్ని సర్వే చేయనున్నట్టు మంత్రి తెలిపారు. వ్యవసాయ భూములతో పాటు ఇళ్ల ఆస్తులనూ సర్వే చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు.
శాశ్వతంగా భూహక్కు ఇవ్వటంతో పాటు వివాదాల పరిష్కారానికి వీలు కలుగుతుందని మంత్రి ధర్మాన అభిప్రాయపడ్డారు. సర్వే చేసిన వెంటనే హద్దులు నిర్ణయించి యజమానికి ల్యాండ్ టైటిల్ అప్పగిస్తామన్నారు. గ్రామాల్లో భూతగాదాలు శాశ్వతంగా లేకుండా చేయాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. రీసర్వే ప్రక్రియ కోసం ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. డ్రోన్లు, కార్స్ టెక్నాలజీ సాయంతో భూముల రీసర్వే జరుగుతుందని తెలిపారు. ఇందుకోసం రూ.987.46 కోట్లు వెచ్చించనున్నట్టు వివరించారు. సర్వే అనంతరం వేసే సర్వే రాళ్లపై ఎవరి చిత్రాలు ఉండబోవని స్పష్టం చేశారు.