Central Election Commission preparations in Telangana : ఈ ఏడాది చివరన జరిగే శాసనసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సన్నాహకాలకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు శిక్షణ సహా.. ఇతరత్రా కార్యక్రమాలను ప్రారంభించింది. ఎన్నికల కోసం అక్టోబర్ గడువుతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. బీఎల్‌వో ద్వారా ఇంటింటి పరిశీలన కొనసాగుతోంది. నకిలీ, మల్టిపుల్ ఎంట్రీ ఉన్న ఓటర్ల వడపోత సాగుతోంది.
Officers Transfer Experience above 3 Years in Telangana : ఈవీఎంల తొలిదశ పరిశీలనా ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. వాటన్నింటితో పాటు ఎన్నికల నిర్వహణ విధులతో నేరుగా ఉండే అధికారుల బదిలీలు, పోస్టింగులపై తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల సీఈవోలకు ఈసీ అదేశాలు జారీ చేసింది. మూడేళ్లకు పైబడి కొనసాగుతున్న వారిని బదిలీ చేయాలని.. పోస్టింగుల విషయంలో నిర్దేశిత మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది.
Exercise on postings of officers in Telangana : జులై నెలాఖరు వరకు నివేదిక సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో.. సదరు అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నికల నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించే అధికారుల పోస్టింగులపై కసరత్తు చేస్తోంది. కలెక్టర్లకు సంబంధించి గతంలోనే ఆ కసరత్తు పూర్తి చేసింది. దీర్ఘకాలికంగా ఒకే చోట కొనసాగుతున్న వారిని బదిలీ చేసింది.