Telangana Assembly Elections 2023 : రాష్ట్ర శాసనసభకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల నిర్వహణ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం.. కసరత్తు ప్రారంభించింది. రెండు రోజుల కిందట హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం... శనివారం ఎన్నికల సన్నద్ధతను సమీక్షించింది. ఈసీ డిప్యూటీ కమిషనర్ నితీష్ వ్యాస్ నేతృత్వంలోని సీనియర్ అధికారుల బృందం.. హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్, అధికారులతో సమావేశమై.. ఓటర్ల జాబితా, మార్పులు, చేర్పులు, ఈవీఎంల సన్నద్ధత, ఇతర అంశాలపై సమీక్షించింది.
CEC focus on Telangana Assembly Elections 2023: ఆధార్ అనుసంధానం, రెండో దశ ఫోటో సిమిలర్ ఎంట్రీల కసరత్తు.. సంబంధిత అంశాలపై ఆరా తీసింది. ఓటర్ జాబితా నుంచి తొలగింపులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తొలగించిన ఓట్లు, వాటి వివరాలను ఆరా తీశారు. ఎలాంటి లోపాలు లేని ఓటర్ల జాబితా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఈసీ బృందం ఆదేశించింది. రిటర్నింగ్ అధికారుల సమగ్ర జాబితాను సిద్ధం చేయాలని సీఈఓ వికాస్ రాజ్‌కు స్పష్టం చేసింది. ఓటరు గుర్తింపు కార్డుల అంశంపై కూడా చర్చించారు. ఈవీఎంల సన్నద్ధత విషయమై కూడా సమీక్షించారు.
ఈసీఐఎల్ తయారు చేసిన ఈవీఎంలే కేటాయింపు: రాష్ట్రానికి ఈ దఫా పూర్తిగా హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ తయారు చేసిన ఈవీఎంలనే కేటాయించారు. దీంతో రాష్ట్రంలో ఉన్న బెంగళూరు బెల్‌కు సంబంధించిన ఈవీఎంలను ఇతర ప్రాంతాలకు తరలించాల్సి ఉంది. కొన్ని ఎన్నికల పిటిషన్లు ఉన్న తరుణంలో ఆ ఈవీఎంలను కదల్చని పరిస్థితి నెలకొంది. పిటిషన్లను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈసీఐఎల్ సరఫరా చేసిన ఈవీఎంలను పరీక్షించి జిల్లాలకు పంపినట్లు సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. వాటికి జూన్ ఒకటో తేదీ నుంచి మొదటి దశ చెకింగ్ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు.