Central Election Team Came To Hyderabad: రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. ఎన్నికల సన్నద్ధతను సమీక్షించింది. ఈసీ డిప్యూటీ కమిషనర్ నితీష్ వ్యాస్ నేతృత్వంలోని సీనియర్ అధికారుల బృందం హైదరాబాద్ లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్, అధికారులతో సమావేశమైంది. ఓటర్ల జాబితా, మార్పులు, చేర్పులు,ఈవీఎంల సన్నద్ధత, ఇతర అంశాలపై సమీక్షించారు.
Election Commission: రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణపై ఈసీ దృష్టి.... - సీఈసీ డిప్యూటీ కమిషనర్ నితీశ్ వ్యాస్
18:14 April 15
రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణపై ఈసీ దృష్టి
ఎలాంటి లోపాలు లేని ఓటర్ల జాబితా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఈసీ బృందం ఆదేశించింది. రిటర్నింగ్ అధికారుల సమగ్ర జాబితాను సిద్ధం చేయాలని సీఈఓ వికాస్‌రాజ్‌కు స్పష్టం చేసింది. జూన్ ఒకటో తేదీ నుంచి ఈవీఎంల మొదటి దశ చెకింగ్ చేపట్టాలని.. జిల్లా ఎన్నికల అధికారులకు త్వరలోనే రెండు రోజుల సెమినార్ నిర్వహిస్తామని పేర్కొంది. ఈసీఐఎల్ సరఫరా చేసిన ఈవీఎంలను పరీక్షించి జిల్లాలకు పంపామని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అన్ని స్థాయిల అధికారులకు.. ఇంకా విధులు నిర్వహించే అందరికీ శిక్షణ కోసం ప్రణాళిక రూపొందించాలని కేంద్ర ఎన్నిక సంఘం పేర్కొంది. ఓటర్ల భాగస్వామ్యం, పోలింగ్ శాతం పెరిగేలా అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని ఈసీఐ బృందం రాష్ట్ర అధికారులకు స్పష్టం చేసింది.
శాసనసభ ఎన్నికకు వ్యూహాలు రచించుకుంటున్న పార్టీలు:ఈ ఏడాదే శాసన సభకు ఎన్నికలు జరగడంతో అన్ని పార్టీలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. ఇప్పటి నుంచి ప్రచారం ప్రారంభించాయి అన్నంతగా ఉంది ప్రతి పార్టీ తీరు. ఇదే చివరి ఎన్నిక అన్నట్లు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమనే విజయం వరిస్తుందనే ఆశతో రాజకీయ పార్టీలు రాష్ట్రంలో పావులు కదుపుతున్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తన అధికారాన్ని నిలుపుకొని.. ఈసారి హ్యాట్రిక్ కొట్టాలనే ఉద్దేశంతో ఉంది. ముఖ్యమంత్రి మొదలు పార్టీలోని మంత్రులు అందరూ నిత్యం ప్రజల్లోనే ఉంటూ.. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సారి కూడా తమదే విజయం అన్నట్లు ప్రచారం చేస్తోంది.
మరి రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తోంది. అందులో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క పాదయాత్రలతో మంచి జోరు మీద ఉంటూ.. అధికార పక్షంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న.. ఈసారి దక్షిణాదిలోని రెండో రాష్ట్రంలో ఎలాగైనా విజయం సాధించాలని ఆ దిశగా తన వ్యూహాలను మార్చుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక గళం వినిపించే వారిని తమ పార్టీలో చేర్చుకుని.. తమ బలాన్ని ప్రదర్శించాలని చూస్తోంది. అలాగే మిగిలిన పార్టీలు కూడా తమతమ ఆలోచనలతో ముందుకు సాగుతున్నాయి. ఈ సారి ఎవరు అధికారంలోకి వస్తారో ఈ ఏడాది చివరి వరకు ఎదురుచూడక తప్పదు.
ఇవీ చదవండి: