మాజీ మంత్రి ఈటల రాజేందర్ భర్తరఫ్, అనంతరం శాసనసభ్యత్వానికి రాజీనామాతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఈటల రాజీనామాను జూన్ 12వ తేదీన శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. దీంతో ఉపఎన్నిక(Huzurabad By Election) హడావుడి ప్రారంభమైంది. రాజేందర్ పూర్తిగా నియోజకవర్గంలోనే మకాం వేశారు. పాదయాత్ర కూడా చేశారు. అనారోగ్యంతో పాదయాత్ర నిలిచిపోగా... ప్రచారాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. ఆయనకు మద్దతుగా భాజపా నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారంలో పాల్గొంటున్నారు.
సభలు, సమావేశాలు, ర్యాలీలు
అటు అధికార తెరాస కూడా ఉపఎన్నికకు ముందు నుంచే సిద్ధమవుతోంది. ఈటల రాజీనామా.. ఆమోదం పొందినప్పటి నుంచి పార్టీ పరంగా హుజూరాబాద్‌లో కార్యక్రమాలు ప్రారంభించారు. సభలు, సమావేశాలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. చేరికలు కూడా జోరుగా సాగుతున్నాయి. నియోజకవర్గ నేతలకు కొన్ని పదవులు కూడా ఇచ్చారు. జిల్లా మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇతర తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలకు మండలాలు, గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగించారు. వారంతా అక్కడే మకాం వేసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉపఎన్నికకు పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను తెరాస ఇప్పటికే ప్రకటించింది.
యుద్ధప్రాతిపదినక మౌలికవసతుల కల్పన
అటు ప్రభుత్వ పరంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. ఫించన్లు, రేషన్ కార్డులు సహా ఇతరత్రా పనులన్నీ యుద్ధప్రాతిపదికన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గం ఎంచుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అక్కడ పథకాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం లబ్ధిదారులకు సంబంధించి సర్వే కొనసాగుతోంది. అంతకు ముందే దళితవాడలన్నింటిలో విస్తృత సర్వే చేపట్టి యుద్ధప్రాతిపదినక మౌలికవసతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించారు. అధికార తెరాస, భాజపా మధ్య ఆరోపణలు-ప్రత్యారోపణలు, సవాళ్లు-ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. పరసర్పం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేటలో పడింది. సరైన అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది. ఎన్నిక తేదీ ప్రకటించిన తర్వాతే హస్తం పార్టీ ప్రచార క్షేత్రంలోకి దిగనుంది.