తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాంతీయ రింగు రోడ్డుకు కేంద్రం ఆమోదం

హైదరాబాద్‌ ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణానికి మార్గం సుగమమైంది. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్‌ వరకు ఉత్తర భాగంలో రోడ్డుకు సంబంధించిన భూసేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అనుమతి దస్త్రంపై కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆమోద ముద్ర వేయగా... త్వరలో ఉత్తర్వులు జారీకానున్నాయి. భారత్‌మాల-1 పనుల జాబితాలో చేర్చిన కేంద్రం... దక్షిణ భాగానికి నెంబర్‌ కేటాయింపు కసరత్తు ప్రారంభించింది.

Central approval for regional ring road in telangana
ప్రాంతీయ రింగు రోడ్డుకు కేంద్రం ఆమోదం

By

Published : Mar 7, 2021, 5:22 AM IST

హైదరాబాద్‌ ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ఇప్పటికే జాతీయ రహదారి హోదా ఇచ్చిన ప్రాంతంలో భూసేకరణ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దీంతో రింగ్‌ రోడ్డు నిర్మాణ వ్యవహారం ఇక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చింది. భూసేకరణ అనుమతి దస్త్రంపై కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేయగా... త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు వంద మీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్‌ రింగ్‌ రోడ్డును నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. తొలుత నాలుగు వరుసల రహదారి నిర్మించి... ఆ తరువాత మరో నాలుగు వరుసలు విస్తరిస్తారు. ఎనిమిది వరుసలకు తగినట్లు భూసేకరణ ప్రక్రియను చేపట్టనున్నారు.

182 కిలోమీటర్లు

ప్రాంతీయ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగం సంగారెడ్డి-నర్సాపూర్‌-తూప్రాన్‌-గజ్వేల్‌-చౌటుప్పల్‌ వరకు నిర్ణయించి 161(ఎ)(ఎ)గా జాతీయ రహదారి నంబరును కేంద్రం కేటాయించింది. ఈ మార్గం 158 కిలోమీటర్లు. దక్షిణ భాగంగా ఉన్న చౌటుప్పల్‌- షాద్‌నగర్‌-సంగారెడ్డి వరకు 182 కిలోమీటర్లకు కూడా అనుమతి ఇచ్చేందుకు కేంద్రం ఇటీవల సుముఖత వ్యక్తం చేసింది.

భూసేకరణ చేపట్టి

హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డు ఆవల ప్రాంతీయ రింగ్‌ రోడ్డును నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే నిర్ణయించారు. ఆ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అప్పటి నుంచి దిల్లీ-హైదరాబాద్‌ చుట్టూ దస్త్రం తిరుగుతూనే ఉంది. ఒకదశలో కేంద్రం మెలిక పెట్టింది. 500 మీటర్ల మేర భూసేకరణ చేపట్టి.. రహదారి పోను మిగిలిన ప్రాంతాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించుకుని.. ఆ డబ్బుతో ప్రాంతీయ రింగు రోడ్డును నిర్మించుకోవాలని సూచించింది. అంత స్థాయిలో భూసేకరణ చేపట్టడం సాధ్యమయ్యే పని కాదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో.. తాజాగా కేంద్రం వంద మీటర్లకే అనుమతి ఇచ్చింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కార్యాలయానికి కూడా వర్తమానాన్ని పంపినట్లు తెలిసింది. ప్రాంతీయ రింగు రోడ్డును భారతమాల-1 పనుల జాబితాలోనూ కేంద్రం చేర్చింది.

వేగం ఆధారపడి ఉంటుంది

ఉత్తర భాగంగా నిర్మించే 158 కిలోమీటర్ల మార్గం నిర్మాణానికి సుమారు 4,750 ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూ సేకరణకయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా భూసేకరణ చేపడుతుందన్న అంశంపై రహదారి నిర్మాణ వేగం ఆధారపడి ఉంటుంది. దక్షిణ భాగానికి సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపిన కేంద్రం... త్వరలో జాతీయ రహదారి నంబరు కేటాయించి భూసేకరణకు అనుమతి ఇవ్వనుంది.

ఇదీ చూడండి :రాష్ట్ర బడ్జెట్ పరిమాణం పెరిగే అవకాశముందన్న కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details