Medical Colleges in Telangana : దేశంలో కొత్తగా మరో 50 వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. తెలంగాణలో 12 కొత్త వైద్యకళాశాలలు, ఆంధ్రప్రదేశ్‌లో ఐదింటికి ఆమోద ముద్ర వేసింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒక్కో కళాశాలలో 150 సీట్లతో మొదలు కానున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తెలంగాణలోని మేడ్చల్, వరంగల్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, అసిఫాబాద్, నిర్మల్, సిరిసిల్ల, వికారాబాద్, జనగాం, హైదరాబాద్‌లలో కొత్త కళాశాలల ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. మేడ్చల్- మల్కాజ్‌గిరిలో అరుంధతి ట్రస్ట్, మేడ్చల్‌లో సీఎంఆర్ ట్రస్ట్, వరంగల్‌లో ఫాదర్ కొలంబో ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. మిగిలిన అన్ని కాలేజీలు ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే వైద్య రంగంలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణ మొదటి స్థానం సాధించడమే లక్ష్యంగా ఆ శాఖ ప్రణాళికలు రచిస్తోంది.
Medical Colleges in Telangana : కొత్తగా 12 మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం - తెలంగాణకు 12 నూతన వైద్య కళాశాలలు మంజూరు
19:11 June 08
Medical Colleges in Telangana : తెలంగాణలో 12 వైద్య కళాశాలలకు కేంద్రం ఆమోదం
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు : ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 4 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మంజూరు కావడం చాలా గర్వకారణమని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్‌లో మంకమ్మతోట పురాతన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నగర మేయర్ సునీల్ రావుతో కలిసి ఆయన సందర్శించారు. ఆలయ రాజగోపురం, ప్రతిష్ఠ మహోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొని రాజగోపురం ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. నాలుగు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మంజూరు చేయడంతో పాటు కరీంనగర్ జిల్లా మెడికల్ కాలేజీలో ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ట్రిపుల్ ఐటీ కోసం కేంద్రంతో పోరాడుతాం :ప్రస్తుతం కొత్తపల్లి సమీపంలోని సీడ్స్ కార్పొరేషన్ షెడ్లను మరమ్మతులు చేసి తరగతులు ప్రారంభించనున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. వైద్య విద్యకు కావాల్సిన ల్యాబ్స్, క్లాస్ రూంలు, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. 50 ఎకరాల విస్తీర్ణం కలిగిన భూమి కాబట్టి రానున్న రోజుల్లో శాశ్వత భవనాలతో కూడిన వైద్య కళాశాల 500 పడకల హాస్పిటల్‌గా మారబోతుందని వినోద్‌కుమార్ అన్నారు. దీనితో పాటు కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీ కోసం కేంద్రంతో పోరాడుతామని బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టం చేశారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోను 5 కొత్త వైద్య కాలేజీలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఏపీలోని ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, విజయనగరం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పాటు కానున్నాయి.
ఇవీ చదవండి :