DISCOM Payment Dues : ప్రజలకు సరఫరా చేసే కరెంటును విద్యుదుత్పత్తి కేంద్రాల(జెన్‌కో) నుంచి కొంటున్న పంపిణీ సంస్థ(డిస్కం)లు.. వాటికి సొమ్ము చెల్లించకుండా సతాయించడం ఇకపై కుదరదు. అలాంటి డిస్కంలకు కరెంట్ సరఫరా బంద్ చేయనున్నారు.
ఆలస్య చెల్లింపులకు జరిమానా
DISCOM Payment Dues Telangana : డిస్కంలు కరెంటు కొనుగోలు చేసిన 45 రోజుల్లోగా జెన్‌కోలకు బిల్లు చెల్లించాలి. ఆ లోపు చెల్లించకపోతే.. మరో నెల రోజుల అదనపు సమయం ఇస్తారు. అప్పటికీ చెల్లించకుంటే.. ఆయా డిస్కంలకు కరెంటు సరఫరాలో 25 శాతాన్ని జెన్‌కోలు తగ్గించి ఇంధన ఎక్స్ఛేంజ్‌లో ఇతరులకు అమ్ముకోవచ్చు. గడువు తీరినా చెల్లించని బకాయిపై జరిమానాగా 0.5 శాతం ‘ఆలస్య రుసుం’ విధిస్తారు. గడువులోగా బకాయిలు చెల్లించడానికి డిస్కంలు ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి అందులో సొమ్ము జమచేయాలి.
బకాయిలు చెల్లిస్తేనే డిస్కంలకు విద్యుత్! 6 నుంచి 24 నెలల్లో చెల్లించవచ్చు..
- Telangana DISCOM Payment Dues : పాత బకాయిలను ‘నెలవారీ వాయిదా’ల్లో చెల్లించడానికి కేంద్రం అవకాశం ఇచ్చింది. బకాయి మొత్తాన్ని బట్టి 6 నుంచి 24 నెలల వరకూ చెల్లించేందుకు వీలు కల్పించింది. ఆ మేరకు జెన్‌కోలు డిస్కంలకు నోటీసులు ఇస్తాయి. దాని ప్రకారం ఒప్పందం చేసుకొని పాత బకాయిలు చెల్లించడానికి డిస్కంలు ముందుకు రాకపోతే వెంటనే 25 శాతం సరఫరా తగ్గించి దానిని ఇంధన ఎక్స్ఛేంజ్‌లో జెన్‌కో ఇతరులకు అమ్ముకోవచ్చు.
- నోటీసు ఇచ్చిన నెల రోజులకు కూడా డిస్కంలు బకాయిలు చెల్లించే ప్రక్రియ చేపట్టకపోతే కరెంటు సరఫరా వంద శాతం అపేసి.. దానిని ఇంధన ఎక్స్ఛేంజ్‌లో విక్రయించుకోవచ్చు. ఒప్పందంలోని కరెంటును ఇలా బయట అమ్ముకున్నా ‘స్థిరఛార్జీ’ని డిస్కంలు చెల్లించాల్సిందే.
- జెన్‌కో నోటీసు ఇచ్చిన రెండున్నర నెలల తరవాత కూడా సొమ్ము చెల్లించకపోతే.. డిస్కంలు బయట తాత్కాలికంగా కొనే విద్యుత్‌పైనా ఆంక్షలు విధిస్తారు. తొలుత నెలకు 10 శాతం కోత విధిస్తారు. క్రమక్రమంగా దేశంలో ఎక్కడా కరెంటు కొనకుండా ఆయా డిస్కంలను అడ్డుకుంటారు. ప్రస్తుత కొనుగోళ్లకు సకాలంలో చెల్లింపులు జరపకున్నా ఇవే షరతులు అమలవుతాయి.
- పాత బాకీలు పూర్తిగా చెల్లిస్తే ఆంక్షలన్నీ రద్దుచేసి యథావిధిగా కరెంటు సరఫరా పునరుద్ధరిస్తారు.