రాష్ట్ర ప్రభుత్వం రుణాలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం.. ఇక్కడి ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లేఖల సంప్రదింపులు కొనసాగుతున్నా ఈ అంశం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. దీంతో జూన్‌లో వేతనాలు చెల్లింపులతో పాటు విధిగా వ్యయం చేయాల్సిన వాటికి నిధుల సమీకరణపై ఆర్థికశాఖ ఆందోళన చెందుతోంది. జూన్‌లోనే సుమారు రూ.20 వేల కోట్లు చెల్లించాల్సినవే ఉండటంతో సర్దుబాటు ఎలా అన్న అంశంపై తర్జనభర్జన పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు, పింఛన్లు, వడ్డీల చెల్లింపులతో పాటు సబ్సిడీలు సహా విధిగా ప్రతినెలా చెల్లింపులు చేయాల్సిన జాబితాలో ఉన్నాయి. వీటికే సుమారు రూ.10 వేల కోట్లు అవసరమవుతాయి. దీంతోపాటు వానాకాలం రైతుబంధుకు రూ.7600 కోట్లు అవసరమని ప్రభుత్వం ప్రతిపాదించింది. జూన్‌లో రైతు బంధు ఇవ్వడం ద్వారా పెట్టుబడి తోడ్పాటు అందుతుందని భావించిన ప్రభుత్వం నిధుల సమీకరణకు ప్రయత్నిస్తోంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం సొంత రాబడులతో పాటు రుణాలపై ఆధారపడి బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించింది. ఈ ఏడాది బడ్జెట్ పరిధిలో, బడ్జెట్ వెలుపల రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.లక్ష కోట్ల అభివృద్ధి రుణాలను సమీకరించుకోవడానికి ప్రతిపాదించింది. ఇందులో జూన్ నెలాఖరు నాటికి రూ.11 వేల కోట్లను బాండ్ల విక్రయం ద్వారా మార్కెట్ రుణాలను తీసుకునేందుకు నిర్ణయించింది. ఇప్పటివరకు రూ.270 కోట్లకు మించి సమీకరించలేకపోయింది. ఈ క్రమంలో సొంత పన్నుల రాబడి, కేంద్రం నుంచి వచ్చిన పన్నుల వాటాతోనే ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. మే నెలలోనే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లతో పాటు ఇతర చెల్లింపులపై ప్రభావం పడింది. వేతనాలు, పింఛన్ల చెల్లింపుల్లో జాప్యం నెలకొంది. దీంతో నెలలో మొదటివారం అంటేనే ఆర్థికశాఖ అధికారులు ఆందోళన చెందే పరిస్థితి వచ్చింది. పలు జిల్లాల్లో రెండో వారానికి గాని ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా విధిగా చేయాల్సిన చెల్లింపులకు సర్దుబాట్లు తప్పడంలేదు.
రూ.10 వేల కోట్లకు మించని రాబడి