సమర్థమైన పోలీసింగ్, పౌరభద్రత కోసం తెలంగాణ పోలీసులు ప్రారంభించిన ప్రత్యేక పోలీస్ యాప్ స్టోర్ (టీఎస్‌కాప్)పై కేంద్రం ప్రశంసల జల్లు కురిపించింది. మొబైల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను విస్తృతంగా ఉపయోగించుకోవడాన్ని మంచి ప్రయత్నంగా అభివర్ణించింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా ప్రచురించిన నివేదికలో రాష్ట్రాల్లో అమలవుతున్న అత్యుత్తమ పోలీసు విధానాల్లో దీన్ని ఒకటిగా పేర్కొంది.
అధికారులు సమాచారాన్ని ఉపయోగించే విధానానికి ఇది కొత్త అర్థం చెబుతున్నట్లు పేర్కొంది. అందుబాటులోకి వచ్చిన సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించి ఈ యాప్ నేరుగా అధికారులకు అందిస్తున్నట్లు తెలిపింది. దీనివల్ల సమగ్రమైన రీతిలో పోలీసు సేవలు అందించడానికి వీలవుతోందని పేర్కొంది.
నివేదిక పేర్కొన్న యాప్ విశిష్టతలు
* ఈ యాప్‌లో పోలీసులకు అప్పగించిన పాత్రను బట్టి యాప్‌లు అందుబాటులోకి వస్తాయి. మొత్తం 54 సేవలను గుర్తించి, వాటిని విభిన్నపాత్రలు పోషించే అధికారుల కోసం ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో అందుబాటులోకి తేవడం ముదావహం.
* జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీల గురించి రియల్‌టైమ్‌లో సమాచారం అందడం, తరచూ నేరాలకు పాల్పడేవారి కదలికలను జీపీఆర్‌ఎస్ ద్వారా ట్రాకింగ్ చేయడం, నేరనేపథ్యం ఉన్న ప్రాంతాలపై రియల్‌టైమ్ నిఘా పెట్టడం వల్ల గత ఏడాదితో పోలిస్తే ఈసారి 18% నేరాలు తగ్గాయి.
* డయల్ 100ను హెచ్‌వైడీకాప్ యాప్‌కు అనుసంధానం చేయడం వల్ల సమీపంలోని పోలీస్టేషన్లకు అత్యవసర హెచ్చరికలు వేగంగా పంపడానికి వీలవుతోంది. ఈయాప్ లేని సమయంలో అత్యవసర స్పందనకు 30 నిమిషాలు పడితే, ఇప్పుడు 5 నిమిషాల్లోపే సరిపోతోంది.