జనాభా లెక్కల(Census in india) సేకరణ కార్యక్రమం ఈ ఏడాది (2021) ఇక లేనట్టేనని తేలిపోయింది. వచ్చే ఏడాది (2022) ఆరంభంలో తొలుత ఇంటింటి సర్వే చేసే అవకాశాలున్నాయి. దాని ప్రకారం 2022 చివర్లో గానీ లేదా 2023 ఆరంభంలో ప్రతిఒక్కరి వ్యక్తిగత వివరాలను సేకరించే తుది జనగణన జరగనుందని తాజా సమాచారం. ఈలోగా ప్రతి జిల్లా, మండలం, గ్రామంలో ఉండే జననివాస ప్రాంతాల భౌగోళిక వివరాలను మళ్లీ సేకరించాలని కేంద్ర జనగణన విభాగం తాజాగా రాష్ట్రాలను ఆదేశించింది. 2021 డిసెంబరు 31లోగా ఈ వివరాలన్నీ కొత్త భౌగోళిక సరిహద్దు వివరాలతో ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని నిర్దేశించింది. వాస్తవానికి ఈ వివరాలను 2020 ఆరంభంలోనే సేకరించారు. వాటి ఆధారంగా 2020 ఏప్రిల్, మే నెలల్లో జనగణన తొలిదశ కింద ఇంటింటి సర్వేకు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో కరోనా(corona), లాక్‌డౌన్(lock down) కారణంగా వాయిదా వేశారు. గతంలో సేకరించిన సమాచారాన్ని పక్కనపెట్టి మళ్లీ కొత్తగా అన్ని వివరాలు నమోదు చేయాలని కేంద్రం సూచించింది.
భౌగోళిక వివరాలు
ఏ రాష్ట్రంలోనైనా కొత్తగా జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు మారినా, కొత్త కాలనీలు ఏర్పాటైనా తదితర జననివాస ప్రాంతాల సరిహద్దు వివరాలన్నింటినీ మరోసారి తనిఖీ చేసి నమోదు చేయాలని తెలిపింది. ఉదాహరణకు తెలంగాణలో గత రెండేళ్లుగా పలు కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. దీనివల్ల పాత మండలాల సరిహద్దులు మారి గ్రామాలను కొత్తవాటిలోకి చేర్చారు. తాజాగా ఇటీవల వరంగల్ అర్బన్, గ్రామీణ జిల్లాల పేర్లను వరంగల్(warangal district), హన్మకొండగా(hanamkonda district) మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం(telangana government) ఉత్తర్వులిచ్చింది. ఏపీలో(ap) కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఇలా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల జననివాస సరిహద్దు వివరాలను పక్కాగా నమోదు చేయడంతో జనగణన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇది పూర్తయిన తరవాత ప్రతి ఇంటికి వెళ్లి ఇంటిలోని సౌకర్యాలు, కుటుంబాల వివరాలను సేకరిస్తారు. దీన్ని బట్టి 2022 నాటికి కూడా జనగణన పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదని ఒక అధికారి అభిప్రాయపడ్డారు.
ఇదే మొదటిసారి...