World Telugu Writers Conference: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ వేదికగా జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభల్లో.. దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, ఫ్రాన్స్, సింగపూర్, బోట్స్‌వానా సహా పలు దేశాల నుంచి సాహితీ ప్రముఖులు, భాషాభిమానులు తరలివచ్చారు. నాలుగేళ్లకోసారి నిర్వహించే ఈ మహాసభలు.. సిద్దార్థ కళాశాల ప్రాంగణంలో తెలుగు భాష, సంస్కృతులు ఉట్టిపడేలా తీర్చిదిద్దిన మూడు వేదికలపై జరుగుతున్నాయి. "స్వభాషను రక్షించుకుందాం-స్వాభిమానం పెంచుకుందాం" అనే నినాదంతో.. ఈ మహాసభల ద్వారా తెలుగు భాషాభిమానులు, సాహితీ ప్రముఖులంతా ఒకే వేదికపైకి వచ్చారు.
తొలిరోజు మహాసభలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. సాయంత్రం తెలుగు వెలుగుల సభ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు అన్నవరపు రామస్వామి, దండమూడి సుమతి, సినీ గేయ రచయిత భువనచంద్ర, 72 మేళకర్త రాగాల పరిశోధకుడు స్వరవీణాపాణి, సిద్దార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు ఆత్మీయ అతిథులుగా హాజరయ్యారు.
తెలుగు భాష ప్రస్తుత పరిస్థితిపై ఆవేదన: "గమ్యం-గమనం" పేరిట బెంగళూరుకు చెందిన పువ్వాడ శివరామవిఠల్, వేణుగోపాల్ సమర్పించిన గ్రంథాన్ని.. పెద్ది సాంబశివరావు కూర్చిన "ఆంగ్లం-తెలుగు" నిఘంటువును ఆవిష్కరించారు. సాంకేతికత ద్వారా భాషను ఏ విధంగా పరిపుష్టి చేసుకోవాలనే దానిపై.. రచయితలు, మేధావులు, నిపుణులు ఆలోచించాలని జస్టిస్ ఎన్వీ రమణ కోరారు. మహాత్మాగాంధీ, భోగరాజు పట్టాభిసీతారామయ్య, పి.వి.నరసింహారావు మాటలను ప్రస్తావిస్తూ.. తెలుగు భాష ప్రస్తుత పరిస్థితిపై ఆవేదన వ్యక్తంచేశారు.