CEC Team Meeting with Telangana Officials in Hyderabad : అక్రమ డబ్బు, మద్యంతో పాటు మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకునే విషయమై.. కేంద్ర ఎన్నికల సంఘం ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. శాసనసభ ఎన్నికల సన్నద్ధత సమీక్షించిన ఈసీ బృందం.. చివరి రోజైన ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీకుమార్, సీనియర్ అధికారులతో సమావేశమైంది. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు, ప్రణాళికలను సీఎస్, డీజీపీ ఎన్నికల సంఘానికి వివరించారు.
పలు అంశాలను ఆరా తీసిన ఈసీ బృందం (CEC Team) .. ప్రలోభాల పర్వంపై ఎక్కువగా దృష్టి సారించినట్లు సమాచారం. డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాల స్వాధీనానికి సంబంధించి చాలా తక్కువ చూపుతున్నారని.. ఈసీ బృందం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాలకు సంబంధించి అధికారులు ఇస్తున్న లెక్కలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదని అన్నట్లు సమాచారం. ప్రలోభాల సూత్రధారులను ఎందుకు గుర్తించలేకపోతున్నారని.. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించినట్లు తెలిసింది.
TS Assembly Elections 2023 : 'ఈ దఫా ఎన్నికల్లో అన్నీ కొత్త ఈవీఎంలే'
మద్యం విషయంలో నివేదికలు వాస్తవాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయని ఈసీ బృందం (Central Election Commission) అన్నట్లు సమాచారం. మాదక ద్రవ్యాలకు సంబంధించి ప్రసార మాధ్యమాల్లో నిత్యం మీడియాలో కథనాలు చూస్తున్నామని.. స్వాధీనానికి సంబంధించిన నివేదికలు మాత్రం అందుకు తగ్గట్లుగా లేవని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఎన్ఫోర్స్మెంట్ విభాగాల నుంచి తగిన వివరాలు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
Central Election Commission Team to Visit Telangana : కలెక్టర్లు, పోలీసు అధికారుల బదిలీలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై.. ఉన్నతాధికారుల నుంచి ఈసీ బృందం వివరణ తీసుకున్నట్లు సమాచారం. పక్కపక్క జిల్లాలకే ఎందుకు బదిలీలు చేస్తున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. పారదర్శకంగా, ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఎన్నికలు నిర్వహించాలన్నది తమ ఉద్దేశమని.. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి అధికారులందరూ తమ కింద డిప్యూటేషన్గా పనిచేయాల్సి ఉంటుందని అన్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో అధికారులు మంచి ఫలితాలు చూపారని.. ఇక్కడ కూడా సమర్థంగా, పటిష్టంగా పనిచేసి అదే తరహాలో ఫలితాలు రాబట్టాలని అధికారులకు ఈసీ బృందం స్పష్టం చేసినట్లు తెలిసింది.