ఆర్టీసీ(RTC) సంస్థ అంటే ప్రజల్లో నమ్మకం ఉంది. అంతకు మించి విశ్వాసం ఉంది. అండగా ఉండాల్సిన యాజమాన్యమే కార్మికుల సొమ్ము వినియోగించుకుంది. ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వలేకపోయింది. సంస్థకు రూ.వేల కోట్లలో నష్టాలు రావడంతో కార్మికుల నుంచి తీసుకున్న మొత్తాన్ని ఇప్పట్లో చెల్లించే పరిస్థితులు కనిపించడం లేదు. ఫలితంగా కార్మికులకు సంస్థపై నమ్మకం పోతోంది.
సభ్యత్వాలు రద్దు
సీసీఎస్‌లో 46,000ల మంది సభ్యులు ఉన్నారు. కార్మికుల జీతాల నుంచి ప్రతినెలా 7.5శాతాన్ని సీసీఎస్(CCS)కు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ సొమ్మును యాజమాన్యం గత రెండేళ్లుగా చెల్లించడంలేదు. ఫలితంగా తీసుకున్న అసలు, వడ్డీ కలుపుకుంటే రూ.1,100ల కోట్ల బకాయిలను యాజమాన్యం సీసీఎస్‌కు చెల్లించాల్సి ఉంది. ఇప్పట్లో ఆ డబ్బును చెల్లించే ఆర్థిక పరిస్థితి సంస్థకు లేదు. ఫలితంగా ఒక్కో సభ్యుడు సీసీఎస్ సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు సుమారు 20వేల మంది సభ్యులు తమ సభ్యత్వాన్ని రద్దు చేసుకున్నట్లు సీసీఎస్ పాలకమండలి సభ్యులు తెలిపారు.
రెండేళ్లు గడిచినా ఇబ్బందులే
కార్మికుల జీతం నుంచి మినహాయించిన 7.5శాతం సొమ్మును సీసీఎస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుంది. తద్వారా వచ్చిన ఆదాయంతో ఉద్యోగులకు తక్కువ వడ్డీకీ హౌసింగ్ లోన్, పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం రుణాలు ఇవ్వడం ద్వారా సంఘానికి ఆదాయం సమకూరుతుంది. ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న సంస్థ నుంచి మాతృసంస్థ ఆర్టీసీ... సీసీఎస్ నుంచి రూ.1,100ల కోట్ల వరకు తమ అవసరాల కోసం వాడుకుంది. ప్రతి నెలా ఉద్యోగుల జీతాల నుంచి వచ్చే రూ.40 కోట్లను ఆర్టీసీ యాజమాన్యం చెల్లించడంలేదు. రెండేళ్లు గడిచినా సభ్యులకు చెల్లించాల్సిన నగదును చెల్లించే సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో ఏం చేయాలో తెలియక... గతంలోనే పాలకమండలి సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.