ఓఎల్ఎక్స్ నిందితులను పట్టుకునేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ధైర్య సాహసాలు ప్రదర్శించారని సీసీఎస్ జాయింట్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. వారి పనితీరును ప్రశంసించారు. ఓఎల్ఎక్స్ మాధ్యమం ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మందిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఈ ముఠా బంగారం దొంగతనాలకు పాల్పడేదని.. ఇప్పుడు సాంకేతికతని వాడుతూ సైబర్ మోసాలకు పాల్పడుతోందని తెలిపారు.
పోలీసులపై దాడులు
నిందితులను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు రాజస్థాన్ భరత్ పూర్ జిల్లాలోని కళ్యాణ్ పూరి, చౌవేరా గ్రామాలకు వెళ్లగా.. పోలీసులపై గ్రామస్థులు దాడులు చేశారని మహంతి చెప్పారు. తాజాగా ఈ తరహా మోసాలు నగరంలో భారీగా పెరగడంతో భరత్ పూర్ జిల్లా పోలీసుల సహాయంతో నిందితులు ఉండే రెండు గ్రామాలపై దాడులు చేశామని అన్నారు. ఈ క్రమంలో వారు పోలీసులపై దాడులు చేసినా ధైర్య సాహసాలు ప్రదర్శించి 18 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు. ఈ ముఠాపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు.
ఇక నుంచి సైబర్ నేరస్థులపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా పెట్టి చర్యలు తీసుకుంటామని మహంతి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:బెంగళూరులో వర్ష బీభత్సం- భారీగా నిలిచిన ట్రాఫిక్