హైదరాబాద్‌లోని కేంద్ర పరిశోధన సంస్థ సీసీఎంబీ ఏప్రిల్ నుంచి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పరీక్షా ప్రక్రియలో ఆలస్యానికి కారణాలను అన్వేషించింది. ‘ప్రస్తుతం వైరస్‌ను నిర్ధారించే క్రమంలో అనుమానితుల గొంతు, ముక్కు నుంచి సేకరించిన స్రావాల(స్వాబ్)ను రసాయన ద్రావణం ఉన్న ట్యూబ్‌లో వేస్తారు. దాన్ని సీల్‌చేసి ప్రయోగశాల(ల్యాబ్)కు తరలిస్తారు.
సగం ధరకే కొవిడ్ పరీక్ష.. గంటల వ్యవధిలో వైరస్ నిర్ధారణ
కొవిడ్ నిర్ధారణ పరీక్షలను సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) సులభతరం చేసింది. వైరస్ నిర్ధారణ సమయాన్ని గణనీయంగా తగ్గించే ‘డ్రైస్వాబ్’ సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీనికి భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) శుక్రవారం అనుమతి ఇచ్చిందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్‌మిశ్రా తెలిపారు.
వైద్య పరిభాషలో దీన్నే వైరల్ ట్రాన్స్‌పోర్ట్ మీడియం(వీటీఎం) అంటారు. ల్యాబ్‌కు వచ్చాక ట్యూబ్‌లో ద్రావణంతో కలిసి ఉన్న స్వాబ్‌ను వేరుచేస్తారు. తర్వాత ఆర్‌ఎన్‌ఏ యాంప్లిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత పీసీఆర్‌పై పరీక్షించి వైరల్ లోడ్‌నుబట్టి కొవిడ్ సోకిందో లేదో నిర్ధారిస్తారు. ట్యూబ్ నుంచి స్వాబ్‌ను వేరుచేయడం, వీటీఎం, ఆర్‌ఎన్‌ఏ ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతుండటంతో వైరస్ నిర్ధారణకు కనిష్ఠంగా ఒక రోజు సమయం పట్టేది. సీసీఎంబీ అభివృద్ధి చేసిన కొత్త పద్ధతిలో సేకరించిన నమూనాలను ఎలాంటి రసాయన ద్రావణంలో కలపాల్సిన అవసరం (డ్రైస్వాబ్స్) ఉండదు. దీనివల్ల ఆర్‌ఎన్‌ఏ ప్రక్రియ లేకుండా నేరుగా పీసీఆర్‌పై పరీక్షించే వీలుంటుందని’ రాకేశ్‌మిశ్రా తెలిపారు. దీంతో రెండున్నర గంటల్లోనే పరీక్ష ఫలితాలు వస్తాయని, డ్రైస్వాబ్స్‌తో మరింత కచ్చితత్వంతో ఫలితాలు వస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారని వివరించారు.
ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రతిష్ఠాత్మక జర్నల్స్‌లోనూ ఈ పరిశోధన ప్రచురితమైనట్టు చెప్పారు. ‘ఆటోమేషన్‌లో ఆర్‌ఎన్‌ఏ ఎక్స్‌ట్రాక్షన్ చేసినా 500 నమూనాలను పరీక్షించేందుకు 4 గంటలకుపైగా పడుతుంది. తాజా విధానంతో ఒక రోజులో ఎక్కువ పరీక్షలు చేసేందుకు అవకాశం ఉంటుంది, ఈ విధానానికి కొత్త కిట్ల అవసరం కూడా ఉండదు. దీంతో పరీక్ష వ్యయం కూడా సగానికి తగ్గుతుంది’ అని సీఎస్‌ఐఆర్ డైరెక్టర్ జనరల్ శేఖర్ మండే అన్నారు.