ఓసారి వచ్చి తగ్గాక మళ్లీ కరోనా వచ్చే అవకాశం లేదని ఇన్నాళ్లు భావిస్తూ వస్తున్నాం. రెండోసారి వైరస్ దాడిచేస్తే రోగనిరోధక వ్యవస్థ అప్రమత్తమై అప్పటికే తయారై ఉన్న యాంటీబాడీస్‌తో అడ్డుకుంటుందన్న భావన ఉంది. అయితే, యాంటీబాడీస్ స్వల్పకాలమే ఉంటున్నాయనే తాజా అధ్యయనాలతో ఒకింత గందరగోళ పరిస్థితి నెలకొంది.
దీనిపై సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రతో ‘ఈనాడు’ మాట్లాడగా, ఆ భయం అవసరం లేదని స్పష్టంచేశారు.. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘అక్కడక్కడ ఒకరిద్దరు రెండోసారి కొవిడ్ బారిన పడ్డారనే వార్తలొస్తున్నాయి. ఇప్పటికిప్పుడు దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదు.
ఆ అనుమానాస్పద కేసులను క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. లక్షల మందిలో నలుగురైదుగురు మాత్రమే రెండోసారి కొవిడ్ బారిన పడటానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. రెండోసారి వచ్చిందని నిర్ధారించేందుకు చాలా విషయాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
నమూనాలు మారిపోయి పరీక్ష ఫలితాల్లోనూ తప్పులు దొర్లే అవకాశం లేకపోలేదు. ఆయా వ్యక్తుల్లో మొదటిసారి యాంటీబాడీస్ ఉత్పత్తి కాకపోవడం, రోగ నిరోధక వ్యవస్థలో లోపాలూ కారణాలై ఉండొచ్చు. వైరస్ రకాల్లో మార్పులున్నప్పుడూ రోగనిరోధక వ్యవస్థ గుర్తించకపోయే అవకాశం ఉంది. మన దేశంలో, హైదరాబాద్‌లో వ్యాపించిన వైరస్ ఉత్పరివర్తనాల్లో అనూహ్యమైన మార్పులేమి ఇప్పటివరకు కనిపించలేదు.