తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏమరుపాటు వద్దు... మాస్కే ప్రధానాస్త్రం: సీసీఎంబీ డైరెక్టర్‌ - TELANGANA NEWS

కరోనా స్ట్రెయిన్‌తో కేసుల సంఖ్య పెరగటం ఆందోళన కలిగించే విషయమే సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. వైరస్‌ లక్షణాలు, చికిత్స విధానం గతంలో మాదిరిగా ఉన్నాయని... అయినా స్ట్రెయిన్‌తో బాధితుల సంఖ్య పెరిగితే ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు. యూకే నుంచి వచ్చిన అనుమానితుల నమూనాల ఫలితాలు త్వరలోనే వస్తాయని... ఇప్పటికే అందిన నివేదికలపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. వైరస్‌ పట్ల ఏమరుపాటుగా ఉండటం ప్రమాదం కొనితెచ్చుకోవటమేనని... ప్రతి ఒక్కరి చేతుల్లో ఉన్న మాస్కే ప్రధాన అస్త్రమంటున్న రాకేశ్‌ మిశ్రాతో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.

ఏమరుపాటు వద్దు... మాస్కే ప్రధానాస్త్రం: సీసీఎంబీ డైరెక్టర్‌
ఏమరుపాటు వద్దు... మాస్కే ప్రధానాస్త్రం: సీసీఎంబీ డైరెక్టర్‌

By

Published : Dec 25, 2020, 8:43 AM IST

ఏమరుపాటు వద్దు... మాస్కే ప్రధానాస్త్రం: సీసీఎంబీ డైరెక్టర్‌

ప్రశ్న: కొత్తరకం కరోనా స్ట్రెయిన్ పట్ల ఇప్పటివరకు మీరేం గుర్తించారు..?

రాకేశ్‌ మిశ్రా: ప్రస్తుతం మా దగ్గరికి వచ్చిన కొందరు అనుమానితుల నమూనాలను పరిశోధిస్తున్నాం. మరికొన్ని రోజుల్లోనే వీటికి సంబంధించిన ఫలితాలు రానున్నాయి. కొత్త స్ట్రెయిన్‌కు సంబంధించిన నమూనాల నివేదికలపై అధ్యయనం చేస్తున్నాం. స్ట్రెయిన్ కారణంగా విపరీతంగా కేసులు పెరుగుతుండటం ఆందోళనకలిగించే విషయమే.

ప్రశ్న: స్ట్రెయిన్ వైరస్‌ గతంతో పోల్చితే అంత ప్రమాదకారం కాదని చెబుతున్నారు. దీనిలో ఎంత వరకు వాస్తవముంది?

రాకేశ్‌ మిశ్రా: వైరస్‌ లక్షణాలు, చికిత్స విధానం గతంతో పోల్చితే ఒకే విధంగా ఉన్నప్పటికీ... బాధితులు రెట్టింపవుతుండటం ఆందోళనకలిగించే విషయం. ఎందుకంటే మనకు అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు పెరుగుతున్న రోగులకనుగుణంగా చికిత్స అందించాలంటే ఇబ్బందికరం. కరోనా మొదలైన నాటి నుంచి వైరస్‌ను అదుపుచేయటం, మరణాలు అరికట్టడం, రికవరీ పెంచటంలో ఇప్పటి వరకు అద్భుత పనితీరు కనబర్చాం. ఈ పరిస్థితుల్లో మళ్లీ ఒక్కసారిగా బాధితులు పెరగటం ఇబ్బందికరంగా ఉంటుంది. అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ఎందుకంటే ఈ వైరస్‌ వ్యాప్తి పట్ల ఇప్పటికే అందరికీ అవగాహన పెరిగింది. దీనిని కట్టడి చేసేందుకు ప్రధాన ఆయుధం మాస్క్‌ మాత్రమే.

ప్రశ్న: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ రోగుల సంఖ్య చాలా వరకు తగ్గింది. అదే సమయంలో వైద్యసదుపాయాలు ఎక్కువయ్యాయి. కొత్త స్ట్రెయిన్‌కు అనుగుణంగా సేవలందించే సామర్థ్యం లేదంటారా?

రాకేశ్‌ మిశ్రా: మన దేశంలో వైద్యసదుపాయాలు కచ్చితంగా పెరిగాయి. యూకే, యూఎస్‌ స్థాయిలో ఎక్కడా పెరగలేదు. మహమ్మారి కారణంగా అలాంటి దేశాలే విలవిలలాడుతుంటే... అక్కడితో పోల్చితే ఎంతో ఎక్కువ జనాభా ఉన్న మనదేశంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మన వైద్యసౌకర్యాలతో విపత్తును ఎదుర్కొనవచ్చుననే భావన సరికాదు. వైద్యసదుపాయాలు పెరగటం, కొవిడ్‌ టీకా రావటం శుభపరిణామమే అయినా... వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఎవరికి వారు స్వచ్ఛందంగా పోరాడాల్సిందే.

ప్రశ్న: ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారిలో యాంటీబాడీస్‌ కారణంగా మళ్లీ వైరస్‌ సోకదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కోలుకున్న వారిపై ఈ కొత్తరకం స్ట్రెయిన్ మళ్లీ ప్రభావం చూపుతుందంటారా?

రాకేశ్‌ మిశ్రా: యూకేలో 915మందికి పరీక్షలు జరిపితే... అందులో నలుగురు మరోసారి వైరస్‌ బారిన పడినవారు ఉన్నారు. అనగా 0.4శాతం మంది మళ్లీ రీఇన్‌ఫెక్షన్‌కు గురయినట్లు తెలుస్తుంది. ఇది ఎక్కువే అయినా... పరిశోధనలు, వ్యాక్సిన్‌ సంస్థలు దీనిని పెద్ద సమస్యగా చెప్పటంలేదు. అలాగని వైరస్‌ నుంచి కోలుకున్నామని ఏమరుపాటుగా వ్యవహరించటం ఏ మాత్రం సరైందికాదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మళ్లీ కరోనా బారిన పడటం, ఇలాంటి తీరు చుట్టూ ఉన్నవారిపై పడటం, వైరస్‌ను వ్యాప్తిని పెంచటం జరుగుతాయి. అందుకే వైరస్‌ నుంచి కోలుకున్నా, భవిష్యత్‌లో వ్యాక్సిన్ వేసుకున్నా మాస్కును మాత్రం విధిగా ధరించాలి.

ప్రశ్న: కొత్త స్ట్రెయిన్ దృష్ట్యా ఇప్పటికే పలుదేశాలు లాక్‌డౌన్‌ విధించగా... మన దేశంలోనూ కొన్నిచోట్ల రాత్రిపూట కర్ఫ్యూ విధించటంలాంటివి చేస్తున్నాయి. రాష్ట్రంలో అలాంటి అవసరం ఉందనుకుంటున్నారా....?

రాకేశ్‌ మిశ్రా: ప్రజల్లో భౌతికదూరం పెరిగి... వైరస్‌ వ్యాప్తి తగ్గించే చర్యలు హర్షణీయం. ప్రస్తుత పరిస్థితుల్లో మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ కూడా లాక్‌డౌన్‌ అవసరం లేదనుకుంటాను. రాత్రిపూట కర్ఫ్యూలాంటివి చర్యలు ఉద్యోగ, వ్యాపారాలపై పెద్దగా ప్రభావం ఉండగపోగా... వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఎంతో దోహదం చేస్తాయి. కానీ, ప్రజలు అజాగ్రత్తగా ఉంటే లాక్‌డౌన్‌ తప్పక విధించే పరిస్థితి నెలకొంటుంది. అందుకే ప్రజలు ఎవరికివారు ముందుజాగ్రత్త చర్యలు పాటిస్తేనే లాక్‌డౌన్‌ లేకుండా... వైరస్‌ను అరికట్టే అవకాశముంటుంది.

ప్రశ్న: కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ... ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. అధిక జనాభా ఉన్న మన దేశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీకా అందించటం సాధ్యమవుతుందంటారా....?

రాకేశ్‌ మిశ్రా: వ్యాక్సిన్‌ పంపిణీ విషయంలో భారత్‌ ముందు ఎన్నో సవాళ్లున్నాయి. అయినప్పటికీ వీటన్నింటిని కచ్చితంగా అధిగమిస్తుంది. ఇప్పటికే అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. అలాగే, మనం ఒకేరకమైన వ్యాక్సిన్ వాడటంలేదు. పలురకాలైన వ్యాక్సిన్‌లు వాడబోతున్నాం. దేశంలోని పరిస్థితులకనుగుణంగా ఆయా ప్రాంతాలకు తగిన వ్యాక్సిన్‌ ఉపయోగిస్తాం. అలాగే, వ్యాక్సిన్‌ వచ్చిన వెంటనే దేశంలోని ప్రజలందరికీ వేయాల్సిన అవసరంలేదు. అరవై డెబ్బై శాతం మందికి టీకా ఇవ్వాల్సి ఉండగా... వివిధ కారణాలతో మిగతా వారికి అవసరం ఉండదు. ప్రస్తుతం వచ్చే వ్యాక్సిన్లన్నీ అత్యవసర వినియోగానికి మాత్రమే ఆమోదం పొందాయి. ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా అందరి చేతుల్లో ఇప్పటికే ఉన్న మాస్క్‌ను మాత్రమే ప్రధాన వ్యాక్సిన్‌గా భావించాలి.

ప్రశ్న: రానున్న రెండు నెలలు పండగల కాలం. కరోనా, స్ట్రెయిన్ పరిస్థితుల్లో క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకలపై ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు?

రాకేశ్‌ మిశ్రా: పండగలు అందరూ జరుపుకోవాలి. కానీ, ఈ పరిస్థితుల్లో వేడుకలు కుటుంబసభ్యుల మధ్య ఇంట్లో జరుపుకుంటూ... వైరస్‌ కట్టడికి సహకరించాలి.

ఇదీ చూడండి:కాప్‌యాప్‌పై కేంద్రం ప్రశంసలు

ABOUT THE AUTHOR

...view details