తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజధాని చెరువుల్లో కరోనా .. శాస్త్రవేత్తల నిర్ధరణ.! - ఐఐసీటీ, సీసీఎంబీ నీటిపై పరిశోధన

కొవిడ్‌ రెండో ఉద్ధృతి రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే మొదలైందంటున్నారు పరిశోధకులు. నగరంలోని హుస్సేన్‌సాగర్​తో పాటు పలు చెరువుల్లోని నీటి నమూనాలను సేకరించి పరిశోధనలు చేశారు. మార్చిలో పెరుగుదల కన్పించి ఏప్రిల్‌ నుంచి గరిష్ఠ స్థాయిలో కొనసాగుతోందని పేర్కొంటున్నారు.

ccmb declared as covid virus spread in  hussain sagar
రాజధాని చెరువుల్లో కరోనా .. శాస్త్రవేత్తల నిర్ధరణ.!

By

Published : May 15, 2021, 5:25 PM IST

Updated : May 15, 2021, 5:44 PM IST

హైదరాబాద్​లోని హుస్సేన్​సాగర్​ నీటిలో కరోనా వైరస్​ ఉందంటున్నారు పరిశోధకులు. నగరంలోని పలు చెరువుల్లో నీటి నమూనాలపై ఐఐసీటీ, సీసీఎంబీ ఆధ్వర్యంలో పరిశోధనలు చేసినట్లు తెలిపారు. నీటి వనరుల నమూనాల్లోని కరోనా వైరల్‌ లోడు ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. వైరస్‌ సంక్రమణ వ్యాప్తిని ముందే తెలుసుకునేందుకు ఐఐసీటీ, సీసీఎంబీ గతేడాది నుంచి మురుగునీరు, చెరువుల్లో నీటి నమూనాలను తరచూ సేకరించి విశ్లేషిస్తోంది.

నాచారంలోని పెద్ద చెరువు కేంద్రంగా ఏడు నెలలుగా నీటి నమూనాలను సేకరించి పరిశోధనలు చేశారు. మొదట్లో నెలవారీగా విశ్లేషించగా.. ప్రస్తుతం వారం రోజులకోసారి సేకరించి విశ్లేషిస్తున్నారు. దీంతోపాటు నగరంలోని హుస్సేన్‌సాగర్‌, ప్రగతినగర్‌లోని తుర్కచెరువు, నాచారం పెద్ద చెరువు, శివారులో ఘట్‌కేసర్‌లోని ఏదులాబాదు చెరువు, పోతరాజు చెరువుల నుంచి నమూనాలు సేకరించి విశ్లేషించారు.

నాచారం చెరువు నుంచి:

● కొవిడ్‌ మొదటి ఉద్ధృతి ఆఖరు, రెండో ఉద్ధృతి ఆరంభంలో చెరువు నీటి నమూనాల్లోని వైరల్‌ లోడులో స్పష్టమైన తేడాను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. నవంబరులో మొదటి ఉద్ధృతి గరిష్ఠ స్థాయిలో ఉందని తేల్చారు. డిసెంబరు నుంచి జనవరి వరకు తగ్గుతూ వచ్చింది.

● ఫిబ్రవరిలో చెరువుల్లోని నీటి నమూనాల్లో వైరల్‌ లోడు పెరగడం గుర్తించారు. మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో మరింతగా పెరిగింది. ఇదే గరిష్ఠ స్థాయినా? లేదా? అనడానికి మే నెల నమూనాలను విశ్లేషిస్తే ఒక అంచనాకు రావొచ్చు అంటున్నారు ఐఐసీటీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ వెంకటమోహన్‌. ‘చుట్టు పక్కల 10 మంది నివసిస్తున్న నాచారం చెరువు ఆధారంగానే ఉద్ధృతిని అంచనా వేస్తున్నాం. ఇక్కడ ఫిబ్రవరి నుంచి నీటిలో వైరల్‌ లోడు పెరగడం గమనించాం. మిగతా చెరువు నమూనాలు రిఫరెన్స్‌ కోసం తీసుకుంటున్నాం. హుస్సేన్‌సాగర్‌లో రెండుసార్లు నమూనాలు సేకరించినా కొవిడ్‌ వైరస్‌ ఆనవాళ్లు గుర్తించలేదు. శుద్ధి చేసిన నీటినే సాగర్‌లోకి వదులుతుండటం కారణం కావొచ్చు’ అని అభిప్రాయపడ్డారు.

నీటిపై నిఘాతో వ్యాప్తి అంచనా..

సమాజంలో వైరస్‌ వ్యాప్తిని అర్థం చేసుకునేందుకు మురుగునీటి నమూనాలతో పాటూ నగరంలోని నీటి వనరుల నమూనాలతోనూ నిర్ధారణకు రావొచ్చని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. శుద్ధి చేయకుండా మురుగునీరు చెరువుల్లోకి వదలడంతో వీటిలో కొవిడ్‌ వైరస్‌ ఆనవాళ్లు కన్పించాయని చెబుతున్నారు. వీటిపై నిఘాతో వ్యాప్తిని అంచనా వేయవచ్చని తెలిపారు.

ఇదీ చూడండి:రాష్ట్రంపై తౌక్టే ప్రభావం.. మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు..!

Last Updated : May 15, 2021, 5:44 PM IST

ABOUT THE AUTHOR

...view details