CCMB research on Ajnala skeletons: పంజాబ్‌లోని అజ్నాలలో 2014లో పెద్దఎత్తున గుర్తించిన అస్థిపంజరాలు... సైనికులవిగా సీసీఎంబీ గుర్తించింది. బావిలో లభ్యమైన ఈ అస్థిపంజరాలపై శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు జరిపారు. ఇండియా పాక్ విడిపోతున్న సమయంలో జరిగిన అల్లర్లలో చనిపోయిన వారివిగా కొందరు భావించగా... మరికొందరు మాత్రం 1857లో బ్రిటీష్ ఆర్మీ చేతుల్లో మృతి చెందిన భారత సైనికులవిగా చెబుతుంటారు.
పంజాబ్ యూనివర్సిటీకి చెందిన ఆంత్రపాలజిస్ట్ డాక్టర్ జే.ఎస్.సెహ్రావత్.. లఖ్‌నవూకు చెందిన బీర్బల్ సాహ్నీ ఇన్‌స్టిట్యూట్, బెనారస్ యూనివర్సిటీలతో కలిసి పరిశోధనలు చేసినట్టు సీసీఎంబీ ప్రకటించింది. అస్థిపంజరాల డీఎన్ఏలను పరిశీలించినప్పుడు... అవి యూపీ, బిహార్, పశ్చిమబంగాల్‌కు చెందిన వారివిగా గుర్తించినట్లు తెలిపింది. ఈ పరిశోధనల ప్రకారం 26వ నేటివ్ బెంగాల్ ఇన్‌ఫ్యాన్ట్రీ బెటాలియన్‌కు చెందిన సైనికుల అస్థిపంజరాలుగా వెల్లడించింది. ఈ బెటాలియన్‌లో బెంగాల్, ఒడిశా, బిహార్, యూపీకి చెందిన సైనికులున్నట్టు వివరించింది.
చారిత్రక ఆధారాల ప్రకారం ఈ సైనికులు పాకిస్థాన్‌లోని మైన్‌మీర్ వద్ద బ్రిటీష్ సైనికులను చంపినవారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. బ్రిటీష్ సైనికులు వారిని తిరిగి అజ్నాల వద్ద పట్టుకుని చంపినట్టు పేర్కొన్నారు. చరిత్ర చెబుతున్న వాస్తవాలకు ఈ పరిశోధనలు మరింత బలం చేకూరుస్తున్నాయని ఈ సందర్భంగా సీసీఎంబీ ప్రకటించింది.