తెలంగాణ

telangana

ETV Bharat / state

Delta Variant: డెల్టా వైరస్​ రెండు నెలల్లో ఎలాగైనా మారొచ్చు! - తెలంగాణ వార్తలు

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న డెల్టా (బి.1.617.2) రకం రూపాంతరం చెందుతోందా? అంటే.. అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. కొత్త ఉత్పరివర్తనాలతో బలహీనంగా మారుతుందా? లేదా తీవ్ర వ్యాప్తికి కారణం అవుతుందా? అనేది తేలాలంటే మరో రెండు నెలల సమయం పడుతుందని చెబుతున్నారు.

ccmb-advisor-dr-rakesh-mishra-on-delta-variant-virus
Delta Variant: రెండు నెలల్లో ఎలాగైనా మారొచ్చు... ఏమైనా జరగొచ్చు

By

Published : Jun 16, 2021, 10:57 AM IST

ఇప్పటివరకు దేశంలో ఆరేడు రకాల కొవిడ్‌ వైరస్‌(Covid Virus)లు ప్రధానంగా వ్యాప్తిలో ఉన్నాయి. వీటిలో అత్యధికంగా వ్యాప్తిలో ఉన్నది డెల్టా రకమే. కొవిడ్‌ మొదలైన దగ్గర్నుంచి చూస్తే ప్రతి మూడు నుంచి ఆరు నెలలకు ఒక వైరస్‌ రకం ఆధిపత్యం ప్రదర్శించి ఆ తర్వాత క్రమంగా కనుమరుగవుతోంది. డెల్డా రకాన్ని మొదట ఫిబ్రవరిలో గుర్తించారు. ఇప్పటికే నాలుగు నెలలకుపైగా వ్యాప్తిలో ఉంది. మరో రెండు నెలల్లో ఉత్పరివర్తనం చెందే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న డెల్టా రకం వైరస్‌ రెండు నెలల్లో మారిపోతుందని సీసీఎంబీ సలహాదారు డాక్టర్‌ రాకేశ్‌ మిశ్ర(CCMB Advisor Dr. Rakesh Mishra) విశ్లేషించారు.

40 వేల జన్యుక్రమాల ఆవిష్కరణతో..

కొవిడ్‌ రోగుల నమూనాలను సేకరించి వైరస్‌ జన్యక్రమాలను కనుగొనడం ద్వారా ఎప్పటికప్పుడు వైరస్‌లో వచ్చే మార్పులను గుర్తించేందుకు సీసీఎంబీ నేతృత్వంలో నాలుగు నగరాల పరిశోధన సంస్థలు క్లస్టర్లుగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఒక్కో వైరస్‌ నమూనాలను సేకరించి జన్యుక్రమాన్ని ఆవిష్కరించి, రికార్డు చేసేందుకు రూ.4 వేల నుంచి ఐదువేల వరకు ఖర్చవుతుంది. నిధుల సమస్యతో ఇన్నాళ్లు ఈ ప్రక్రియ పెద్దగా ముందుకు సాగలేదు. ఇప్పుడా సమస్య తీరింది. ‘వచ్చే ఏడాది కాలంలో హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీ, పుణె నగరాల నుంచి 40 వేల వైరస్‌ జన్యుక్రమాలు ఆవిష్కరించనున్నట్లు రాకేశ్​ మిశ్ర(Rakesh Mishra) తెలిపారు. దీంతో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న డెల్టా రకంలో వస్తున్న మార్పులు.. భవిష్యత్తులో మూడో మప్పునకు దారితీస్తే ఆరంభంలోనే గుర్తించి ప్రభుత్వాలను హెచ్చరించేందుకు వీలవుతుంది. దేశవ్యాప్తంగా నిర్వహించబోయే సీరో సర్వేతో ఎంతమందిలో యాంటీబాడీస్‌ ఉన్నాయో తెలుస్తుంది. దీన్ని బట్టి హెర్డ్‌ ఇమ్యూనిటీని అంచనా వేయవచ్చు’ అని రాకేశ్‌ మిశ్ర అన్నారు.

ఈ నాలుగే శ్రీరామరక్ష..

లాక్‌డౌన్‌ సడలింపులిస్తున్నా.. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని.. రాబోయే రెండు నెలలు కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, టీకాలు వేయించుకోవడం.. ఈ నాలుగింటినీ పాటిస్తే.. ఏ రకం వైరస్‌ వ్యాప్తిలో ఉన్నా కొవిడ్‌ బారిన పడకుండా రక్షించుకోవచ్చని సీసీఎంబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇదీ చూడండి:Ayurvedic: 'కొవిరక్ష' తైలంతో కరోనాకు దూరం

ABOUT THE AUTHOR

...view details