తెలంగాణ

telangana

ETV Bharat / state

CC Cameras: పోలీసు స్టేషన్లలో మసకబారిన నేత్రాలు - పోలీసు స్టేషన్​లలో నిఘా నేత్రాలు

ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు ఠాణాలో ఓ దళిత మహిళ కస్టోడియల్‌ డెత్‌(Custodial Death) చోటు చేసుకోవడం.. అక్కడ నెల రోజులుగా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో స్వయంగా డీజీపీ(DGP)నే కేసును పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ క్రమంలో పోలీసుస్టేషన్ల(Police Stations)లో సీసీ కెమెరాల(CC Camera) విషయం ప్రాధాన్యం సంతరించుకొంది. రాష్ట్రంలోని ఠాణాల్లో సీసీ కెమెరాల తీరుతెన్నులపై ‘ఈటీవీ భారత్​’ పరిశీలన జరిపింది.

cc cameras
మసకబారిన నేత్రాలు

By

Published : Jun 29, 2021, 7:14 AM IST

దేశవ్యాప్తంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండాలి. ప్రవేశ, నిష్క్రమణ మార్గాలతో పాటు ఠాణా ఆవరణ అంతా కనిపించేలా వాటిని ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా లాకప్‌లో దృశ్యాలు కచ్చితంగా చిత్రీకరించే ఏర్పాటు ఉండాలి. నిందితులను విచారించే సీబీఐ, ఎన్‌ఐఏ, ఈడీ, ఎన్‌సీబీ లాంటి జాతీయ దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లోనూ ఇవి ఉండాలి. 18 నెలల బ్యాక్‌అప్‌ తప్పనిసరి.. ఇదీ దేశ సర్వోన్నత న్యాయస్థానం గత డిసెంబరులో ఇచ్చిన ఆదేశం.

చిత్రంలో కనిపిస్తున్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొమరారం పోలీస్‌స్టేషన్‌. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో 2015లో ఈ ఠాణా ఏర్పాటైంది. కానీ ఇప్పటివరకు ఒక్క సీసీ కెమెరా(CC Camera)ను ఏర్పాటు చేయలేకపోయారు. మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న జూలూరుపాడు, బూర్గంపాడు, ఆళ్లపల్లి, మణుగూరు, ముల్కలపల్లి, టేకులపల్లి, బోడు వంటి ఠాణాల్లో సీసీ కెమెరాల ఊసే లేదు.

తెలంగాణలో 746 శాంతిభద్రతల ఠాణాలున్నాయి. 10 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా దేశంలోనే ఎక్కువ నిఘా నేత్రాలున్న రాష్ట్రంగా పేరుపొందింది. కానీ వాటి నిర్వహణ మాత్రం తీసికట్టుగా ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఠాణాల లోపల కెమెరాల విషయంలో చూపిస్తున్న శ్రద్ధ గ్రామీణ ప్రాంత పోలీసు స్టేషన్లలో కనిపించడం లేదు.

  • నల్గొండ జిల్లాలో 47 ఠాణాలకు 6, సూర్యాపేట జిల్లాలో 28 ఠాణాలకు 4, యాదాద్రి భువనగిరి జిల్లాలో 21 ఠాణాలకు 4 ఠాణాల్లో పలు సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. అడ్డగూడూరు ఠాణాలో నెల రోజుల నుంచి కెమెరాలు పడకేశాయి.
  • వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలోని 52 ఠాణాల్లో కెమెరాలను ఏర్పాటు చేస్తే 12 చోట్ల పనిచేయడం లేదు.
  • నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో 5, తెలకపల్లిలో 5, కోడేరులో 4 ఉండగా ఏవీ పనిచేయడంలేదు. తిమ్మాజిపేటలో 8కి నాలుగు, చారకొండలో 3లో ఒకటి పనిచేస్తున్నాయి.
  • ఆసిఫాబాద్‌ జిల్లా దహేగాం ఠాణాలోని నాలుగు కెమెరాలు దాదాపు ఏడాది నుంచి అలంకారప్రాయంగా మిగిలిపోయాయి.
  • మహబూబాబాద్‌ జిల్లాలో 18 ఠాణాలున్నాయి. మొత్తం 95 కెమెరాలున్నాయి. వీటిలో కేసముద్రం ఠాణాలో 4, మహబూబాబాద్‌ గ్రామీణ ఠాణాలో ఒకటి పనిచేయడం లేదు.
  • ములుగు జిల్లా తాడ్వాయి, కన్నాయిగూడెం తాత్కాలిక ఠాణాలో సీసీ కెమెరాల్లేవు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల, పలిమెలలోనూ ఏర్పాటు చేయలేదు.

కోతులు కొరికేశాయి..!

మెదక్‌ జిల్లాలో మొత్తం 21 ఠాణాలకుగాను 6 ఠాణాల్లో పలు కెమెరాలు నిరుపయోగంగా ఉన్నాయి. శివ్వంపేట ఠాణాలో సీసీ కెమేరా తీగలను కోతులు తెంపడంతో అక్కడున్న ఏడింట్లో ఒక్కటీ పని చేయడం లేదు. నారాయణపేట జిల్లా మాగనూరు, కృష్ణ, నర్వ, మరికల్‌, ధన్వాడ ఠాణాల్లో కెమెరాలు లేవు. కోస్గిఠాణాలో వైర్లను కోతులు తెంపేయడంతో నిఘా నేత్రాలు పనికిరాకుండాపోయాయి.

ఇలా మిగిలాయి...

  • చాలా ఠాణాల్లో నెల రోజుల్లోపు దృశ్యాలను మాత్రమే నిక్షిప్తం చేసే సదుపాయముంది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం 18 నెలల బ్యాకప్‌ ఎక్కడా కానరావడం లేదు.
  • లాకప్‌ల్లోని దృశ్యాలను నిరంతరం చిత్రీకరించేలా సీసీ కెమెరాలుండాలనే ఆదేశాలున్నా ఎక్కువచోట్ల ఆ పరిస్థితి లేదు. సీసీఎస్‌లు, టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌వోటీ తదితర కార్యాలయాల్లో దృశ్యాలను చిత్రీకరించడం దాదాపు లేదనే చెప్పొచ్చు. తీవ్ర, చోరీ సంబంధ నేరాల్లో నిందితుల్ని అక్కడే ఉంచి విచారిస్తుండటంతో అక్కడి దృశ్యాలను నిక్షిప్తం చేయడం లేదని తెలుస్తోంది.
  • సీసీ కెమెరాలు చెడిపోతే ఆయా కంపెనీల సాంకేతిక నిపుణులు అందుబాటులో లేకపోవడంతో రోజుల తరబడి బాగవడం లేదు.

ఇదీ చూడండి:SCHOOL FEE: స్కూల్​ ఫీజులు పెంచితే గుర్తింపు రద్దు

ABOUT THE AUTHOR

...view details