CBI searches across india in case of fake medical certificates: నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ నంబర్ల వ్యవహరంలో దేశ వ్యాప్తంగా 91 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించింది. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్షలో ఫెయిల్ అయినా.. 73మంది విద్యార్దులు సర్టిఫికెట్లు పొందారు. పలు స్టేట్ మెడికల్ కౌన్సిల్లో నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లతో సర్టిఫికెట్లు పొందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ గుప్తా ఫిర్యాదుతో ఈనెల 21న సీబీఐ కేసు నమోదు చేసింది. సెక్షన్ 420, 467, 468,471 సహా పలు సెక్షన్లు నమోదు చేయడం జరిగింది.
తెలంగాణకు చెందిన ముగ్గురు, ఏపీకి చెందిన ఇద్దరు ఫారెన్ గ్రాడ్యుయేట్లను సైతం ఎఫ్ఐఆర్లో చేర్చింది. బిహార్ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ నంబర్ సర్టిఫికెట్ పొందిన వరంగల్ కాజీపేటకు చెందిన గుడిమళ్ల రాకేశ్ కుమార్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ నంబర్ పొందిన చేవెళ్లకు చెందిన సితాలె శ్రీనివాసరావు, రాజస్థాన్ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ నంబర్ పొందిన బాగ్ లింగంపల్లికి చెందిన బొమ్మిరెడ్డి హరికృష్ణ రెడ్డి, బిహార్ మెడికల్ కౌన్సిల్ నుంచి నకిలీ సర్టిఫికెట్ పొందిన విశాఖపట్నంకు చెందిన గొర్ల వెంకట్ రాజా వంశీ, విజయవాడ కొత్త పేటకు చెందిన మారుపిళ్ల శరత్ బాబును ఎఫ్ఐఆర్లో చేర్చింది.