దిల్లీ మద్యం కేసులో విచారించేందుకు ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. రెండు బృందాల్లో వెళ్లిన సీబీఐ అధికారులు.. కేవలం సాక్షిగా మాత్రమే కవిత వివరణను నమోదు చేస్తున్నారు. సీఆర్‌పీసీ 161 కింద ఆమె వాంగ్మూలాన్ని తీసుకుంటున్నారు. విచారణకు వచ్చిన సీబీఐ బృందంలో మహిళా అధికారులు కూడా ఉన్నారు. సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగే అవకాశముంది.
దిల్లీ లిక్కర్ స్కామ్.. 6 గంటలుగా కవితను విచారిస్తున్న సీబీఐ - CBI inquiry Delhi Liquor scam case
10:12 December 11
దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత వివరణ తీసుకుంటున్న సీబీఐ
ఈ కేసులో కవిత విచారణ కోసం ఆరో తేదీని సూచిస్తూ సీబీఐ మొదట లేఖ రాయగా... ఆ రోజు తనకు ఇతర కార్యక్రమాలున్నాయని 11, 12, 14, 15 తేదీల్లో తాను అందుబాటులో ఉంటానని ఆమె ప్రత్యుత్తరం రాశారు. దీంతో సీబీఐ ఆదివారం (నేడు) విచారిస్తామని సమాచారం ఇవ్వగా, కవిత అంగీకరించారు. ఈ క్రమంలోనే ఇవాళ కవిత ఇంటికి సీబీఐ అధికారులు వచ్చారు.
మరోవైపు ఆమె శనివారం ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. మంత్రిమండలి సమావేశం ముగిసిన తర్వాత కవితతో సీఎం మాట్లాడినట్లు తెలుస్తోంది. రాజకీయకక్షతో ఇబ్బందులు పెట్టేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా... అవి ఫలించవని, సీబీఐ విచారణ దానిలో భాగమేనని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. సీబీఐకి ధైర్యంగా సమాధానాలు చెప్పాలని సూచించినట్లు తెలిసింది.
ఈ విషయంలో ఇప్పటికే కవిత పలువురు న్యాయనిపుణుల సలహాలు తీసుకున్నట్లు సమాచారం. పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ తమ ఇంటికి రావద్దని కవిత వారిని కోరారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం వద్ద భారాస నేతలు భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగులు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. డాటర్ ఆఫ్ ఫైటర్.. విల్ నెవర్ ఫియర్ (యోధుని కుమార్తె..ఎన్నటికీ భయపడదు) అని వాటిపై రాశారు. సీబీఐ విచారణ నేపథ్యంలో కవిత ఇంటి మార్గంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: