తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆరు గంటలకు పైగా కవిత విచారణ.. ఆధారాలు సమర్పించాలంటూ మరో నోటీసు

MLC Kavita
MLC Kavita

By

Published : Dec 11, 2022, 6:35 PM IST

Updated : Dec 12, 2022, 7:04 AM IST

13:03 December 11

CBI Inquiry on MLC Kavitha :ఎమ్మెల్సీ కవితను 6 గంటలు విచారించిన సీబీఐ

ఆరు గంటలకు పైగా కవిత విచారణ.. ఆధారాలు సమర్పించాలంటూ మరో నోటీసు

CBI Inquiry on MLC Kavitha Concluded : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాంగ్మూలాన్ని నమోదు చేసిన సీబీఐ మరోసారి 91 సీఆర్‌పీసీ కింద కవితకు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. దిల్లీ సీబీఐ విభాగానికి చెందిన ఎస్పీ స్థాయి మహిళ అధికారి సహా అయిదుగురు అధికారుల బృందం కవితను సుదీర్ఘంగా విచారించి... కవిత వద్ద ఉన్న కొన్ని దస్త్రాలు లేదా డిజిటల్‌ డివైజ్‌ను తమకు అందించాలని పేర్కొంటూ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది.

CBI Inquiry on MLC Kavitha : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెరాస ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. రెండుకార్లలో వచ్చిన సీబీఐ బృందం... బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 14లోని కవిత ఇంటికి చేరుకున్నారు. దిల్లీ మద్యం కేసులో.. 160 సీఆర్‌పీసీ చట్టం ప్రకారం సాక్షిగా విచారించనున్నామని... సీబీఐ ముందుగానే కవితకు సమాచారం పంపింది. ఈ మేరకు కవిత నివాసానికి వచ్చిన సీబీఐ అధికారులు.. మద్యం కేసులో దక్షిణాది లాబీ అంశాలపై ఆమెనుప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసిన శరత్‌చంద్రారెడ్డి, సీబీఐ అరెస్టు చేసిన బోయినపల్లి అభిషేక్, నిందితుడు రామచంద్ర పిళ్లైలతో పరిచయాలు, వ్యాపార సంబంధాలు ఉన్నాయా అని ఆరా తీసినట్లు సమాచారం.

దర్యాప్తులో వెల్లడైన అంశాలు, సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. కవిత వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేసుకున్నారు. అందుకు సంబంధించి ఆధారాలుంటే సమర్పించాలంటూ కవితకు 91 సీఆర్‌పీసీ కింద... మరో నోటీసు జారీ చేసినట్లు సమాచారం. విచారణ మధ్యలో కొద్దిసేపు భోజన విరామం ఇచ్చారు. సాయంత్రం ఆరున్నర గంటలకు అధికారులు కవిత ఇంటి నుంచి బయటకు వెళ్లారు.

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ..ఇందుకు సంబంధించి ఇవాళ కవిత ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సుదీర్ఘ విచారణ ముగిసిన తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కవిత నివాసానికి వెళ్లారు. ఆయన వాహనంలో... తలసానితో కలిసి కవిత ప్రగతిభవన్‌కు వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్‌తో సీబీఐ అడిగిన వివరాలపై చర్చించి తిరిగి తన నివాసానికి తిరిగి వెళ్లిపోయారు. సీబీఐ అధికారులు ఉన్నంత సేపు కవిత నివాసానికి పార్టీ నేతలు, కార్యకర్తలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

CBI Inquiry on MLC Kavitha in Delhi Liquor Scam : ఈ కేసులో కవిత విచారణ కోసం ఆరో తేదీని సూచిస్తూ కవితకు సీబీఐ మొదట లేఖ రాయగా.. ఆ రోజు తనకు ఇతర కార్యక్రమాలున్నాయని 11, 12, 14, 15 తేదీల్లో తాను అందుబాటులో ఉంటానని ఆమె ప్రత్యుత్తరం రాశారు. దీంతో సీబీఐ ఆదివారం (నేడు) విచారిస్తామని సమాచారం ఇవ్వగా, కవిత అంగీకరించారు. ఈ క్రమంలోనే ఇవాళ కవిత ఇంటికి సీబీఐ అధికారులు వచ్చారు.

మరోవైపు ఆమె శనివారం ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. మంత్రిమండలి సమావేశం ముగిసిన తర్వాత కవితతో సీఎం మాట్లాడినట్లు తెలుస్తోంది. రాజకీయకక్షతో ఇబ్బందులు పెట్టేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవి ఫలించవని, సీబీఐ విచారణ దానిలో భాగమేనని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. సీబీఐకి ధైర్యంగా సమాధానాలు చెప్పాలని సూచించినట్లు తెలిసింది. ఈ విషయంలో ఇప్పటికే కవిత పలువురు న్యాయనిపుణుల సలహాలు తీసుకున్నట్లు సమాచారం. పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ తమ ఇంటికి రావద్దని కవిత వారిని కోరారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం వద్ద భారాస నేతలు భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగులు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. డాటర్‌ ఆఫ్‌ ఫైటర్‌.. విల్‌ నెవర్‌ ఫియర్‌ (యోధుని కుమార్తె..ఎన్నటికీ భయపడదు) అని వాటిపై రాశారు. సీబీఐ విచారణ నేపథ్యంలో కవిత ఇంటి మార్గంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు.

కవితపై సీబీఐ విచారణ చేపట్టడంపై పలువురు రాజకీయ పార్టీల నాయకులు స్పందించారు. సీబీఐ విచారణను లైవ్ కాస్టింగ్ ఇవ్వాలని సీబీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. కోర్టులే కేసుల విచారణను లైవ్ ప్రసారం చేస్తుంటే.. సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు లైవ్ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. మరోవైపు కవితపై సీబీఐ విచారణను బహిరంగంగా జరపాలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కేంద్ర సర్కార్.. ఈడీ, ఐటీ, సీబీఐ పేరుతో ప్రాంతీయ పార్టీ నేతలను బెదిరింపులకు గురి చేస్తోందని ఆరోపించారు.

Last Updated : Dec 12, 2022, 7:04 AM IST

ABOUT THE AUTHOR

...view details