CBI inquiry on MLC Kavitha today: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణంలో.. సీబీఐ ఇవాళ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించనుంది. వాంగ్మూలం నమోదు చేయనున్నారు. దిల్లీ సీబీఐ అధికారులు ఈనెల 2న సీఆర్‌పీసీ 160 ప్రకారం నోటీసు ఇచ్చారు. మద్యం కేసుకు సంబంధించిన కొన్ని వివరాలుకావాలని.. హైదరాబాద్ లేదా దిల్లీలో ఎక్కడ వీలవుతుందో చెప్పాలన్న దర్యాప్తు అధికారులు.. ఈనెల 6న కవితను ప్రశ్నించాలని భావించారు. అయితే ఎఫ్ఐఆర్, ఫిర్యాదు ప్రతి ఇస్తే తగిన సమాధానాలు చెప్పగలనని ఈనెల 3న ఆమె.. సీబీఐకి మెయిల్ పంపించారు.
ఎఫ్ఐఆర్, ఫిర్యాదు వెబ్‌సైట్‌లో ఉన్నాయని సీబీఐ ఈనెల 4న ప్రత్యుత్తరం ఇచ్చింది. ఎఫ్ఐఆర్‌లో తన పేరు ఎక్కడా లేకపోయినప్పటికీ.. చట్టానికి కట్టుబడి ఉండే వ్యక్తిగా విచారణకు సిద్ధమన్నారు. అయితే 6వ తేదీన ముందుగా ఖరారైన కొన్ని కార్యక్రమాలు ఉన్నందున ఆరోజు వీలుకాదని.. కవిత సమాచారం ఇచ్చారు. ఈనెల 11, 12, 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లోని తన నివాసానికి రావొచ్చని.. సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈనెల 11న ప్రశ్నిస్తామని దర్యాప్తు అధికారులు పేర్కొనగా.. కవిత అంగీకరించారు. దిల్లీ నుంచి సీబీఐ డీఎస్పీ నేతృత్వంలో అధికారుల బృందం ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలం నమోదు చేయనుంది.