Viveka Murder Case : ఏపీ మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉండే ఓ పవర్‌ఫుల్ వ్యక్తికి సహాయకుడిగా వ్యవహరిస్తున్న నవీన్‌కు సీబీఐ నోటీసులిచ్చింది. అత్యంత ముఖ్యనేతకు సన్నిహితుడైన మరొకరికీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
CBI focus on Viveka Murder Case : ఈనెల 28న కడప ఎంపీ వైెఎస్ అవినాశ్‌రెడ్డిని నాలుగున్నర గంటలపాటు విచారించిన సీబీఐ ప్రధానంగా ఆయన కాల్‌డేటాపై ఆరా తీసింది. నవీన్ అనే వ్యక్తి పేరిట ఉన్న మొబైల్ నంబర్‌కు అవినాష్ ఎక్కువగా కాల్ చేసి మాట్లాడినట్లు దర్యాప్తులో గుర్తించింది. నవీన్ గురించి ఆరా తీసింది.
తాడేపల్లి ప్యాలెస్‌లో ఓ పవర్ ఫుల్ వ్యక్తిని.. సన్నిహితులు ఎవరైనా సంప్రదించాలన్నా, ఫోన్లో మాట్లాడాలన్నా నవీన్ పేరిట ఉన్న నంబర్‌కే కాల్ చేయాల్సి ఉంటుందని.. ఆయన ఆ సమాచారాన్ని పవర్‌ఫుల్ వ్యక్తికి తెలియజేసి మాట్లాడే ఏర్పాటు చేస్తారని సీబీఐ గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి ఎక్కువగా ఆ నంబర్‌కు కాల్స్ చేసినట్లు అంచనాకు వచ్చింది. వీటిపై సమగ్రంగా ప్రశ్నించేందుకు నవీన్‌కు సీబీఐ నోటీసులిచ్చినట్లు సమాచారం.