వ్యాపారం కోసం రుణం తీసుకొని రూ.826.17 కోట్లు దారి మళ్లించారంటూ వైకాపా ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణరాజుకు సంబంధించిన ఇండ్-భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ సంస్థతోపాటు దాని డైరెక్టర్లు, అధికారులపై సీబీఐ దిల్లీ విభాగం కేసు నమోదు చేసింది. రుణమిచ్చిన బ్యాంకుల తరఫున పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ సౌరభ్ మల్హోత్రా ఈ ఏడాది మార్చి 21న ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా గత మంగళవారం సీబీఐ కేసు నమోదు చేసింది.
దర్యాప్తులో భాగంగా అధికారుల బృందం గురువారం హైదరాబాద్, ముంబయి నగరాలతోపాటు ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలోనూ మొత్తంగా 11 చోట్ల సోదాలు నిర్వహించింది. ఎఫ్‌ఆర్‌ఐలో పేర్కొన్న ప్రకారం కేసు వివరాలివీ.. ‘బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్‌లు కలిసి ఇండ్-భారత్ సంస్థకు తొలుత రూ.941.80 కోట్లు, దీనికి అనుబంధంగా రూ.62.80 కోట్లు మంజూరు చేశాయి.
ఇండ్-భారత్ తొలుత కర్ణాటకలో విద్యుత్తు ఉత్పత్తి సంస్థ ఏర్పాటు చేసినప్పటికీ సాంకేతిక కారణాలతో దాన్ని తమిళనాడులోని ట్యూటికోరిన్‌కు మార్చింది. సంస్థ ఏర్పడినప్పటి నుంచి రకరకాల పద్ధతుల్లో నిధులు మళ్లించారు. విద్యుదుత్పత్తి కోసం కొనుగోలు చేసిన బొగ్గు ద్వారా కూడా మాయ చేసినట్లు తేలింది. 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాల్లో సంస్థ రూ.516.20 కోట్ల విలువైన 14,70,861 మెట్రిక్ టన్నుల బొగ్గు కొనుగోలు చేసినట్లు చూపించారు.
బ్యాంకుల ఫోరెన్సిక్ ఆడిట్ ప్రకారం సంస్థ ఆవరణలో అంత బొగ్గు నిల్వలేదు. కొంత బూడిద మాత్రమే ఉంది. బొగ్గు కొనుగోళ్ల రశీదులు అడిగితే చెదలుపట్టి పాడైపోయాయని చెప్పారు. సరఫరా వివరాలను వేబ్రిడ్జిలో పరిశీలించేందుకు ప్రయత్నించగా ఈ సమాచారం కంప్యూటర్లో స్టోర్ కాలేదన్నారు. సరైన రికార్డులు నిర్వహించలేదు. కంపెనీ లావాదేవీల్లో అవకతవకలను బ్యాంకులు పలుమార్లు సంస్థ దృష్టికి తీసుకొచ్చినా మార్పు లేకపోవడంతో సంస్థను నిరర్ధక ఆస్తుల జాబితాలో చేర్చారు. నిందితులంతా కలిసి తాము లబ్ధి పొందేందుకు ప్రయత్నించి రూ.826.17 కోట్ల నష్టం కలిగించారు’ అని సౌరభ్ మల్హోత్రా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఐపీసీతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు.