మద్యం సేవించి వాహనాలు నడపడం... పరిమితికి మించి వేగం... అసలు తాము ఎలా వాహనాలు నడుపుతున్నామో కూడా తెలియకుండా తయారైంది కొందరు వాహనదారుల పరిస్థితి. ఇటీవల కాలంలో నగర శివార్లలో రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారు.. అధికంగా మద్యం మత్తులో వాహనాలు నడిపడం వల్లనే మృతి చెందుతున్నట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. ప్రధానంగా ఈ తరహా ప్రమాదాలు ఎక్కువగా సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్నాయి.
దర్యాప్తులో తేలింది
అబ్దుల్లాపూర్ మెట్‌లోని రాగన్నగూడలోని జీవీఆర్ కాలనీకి చెందిన తల్లి, కుమారుడు ద్విచక్ర వాహనంపై బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి తిరుగు పయనమయ్యారు. అదే సమయంలో వేగంగా వచ్చిన టాటా సఫారీ వారి వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. మరో ఘటన మాదాపూర్‌లోని కొండాపూర్‌కు చెందిన దంపతులు గౌతమ్‌దేవ్, శ్వేత కలిసి ద్విచక్ర వాహనంపై కొండాపూర్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో బాచుపల్లికి చెందిన కాశీ విశ్వనాథ్, అతని మిత్రుడు కౌశిక్ జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో మద్యం సేవించాడు.. వేగంగా వెళ్తూ సైబర్‌టవర్స్ వద్ద ముందుగా వెళ్తున్న దంపతుల వాహనాన్ని ఢీ కొట్టారు. దీంతో గౌతమ్‌దేవ్ మృతి చెందగా, అతని భార్య తీవ్రంగా గాయాలపాలైంది. ఈ తరహా ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని వాటిని కట్టడి చేయడానికి చర్యలు చేపట్టేందుకు సైబరాబాద్ పోలీసులు ఉపక్రమించారు.