తనపై వస్తున్న కుల వివాద ఆరోపణలపై ఏపీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి వివరణ ఇచ్చారు. తాను ఎస్టీ కొండదొర కులంలో జన్మించానని చెప్పారు. తాను ఎస్టీ కాదని కొంతమంది పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారన్న పుష్పశ్రీవాణి.. తన సోదరి వెంకటరామతులసికి 2008 స్పెషల్ డీఎస్సీలో ఎస్టీ కాకపోవడం వల్లే ఉద్యోగం రాలేదనే ఆరోపణల్లో వాస్తవం లేదని వివరించారు. జీవో నంబర్ 3 ప్రకారం.. కేవలం స్థానికులకే ఆ ఉద్యోగానికి అర్హత ఉంటుందని స్పష్టం చేశారు.
తమ కుటుంబం వలస రావడం కారణంగా స్థానికేతరులనే కారణంతో ఉద్యోగం కోల్పోయిందని శ్రీవాణి పేర్కొన్నారు. 2014లో కుటుంబం మొత్తం ఎస్టీ సర్టిఫికెట్ చేయించుకున్నామని స్పష్టం చేశారు. ఆ సమయానికి రాజకీయాలంటే ఏమిటో తనకు తెలియదని వివరణ ఇచ్చారు. తాత, తండ్రుల స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని టి.డి పారాపురం అని.. ఆ ఊరు వెళ్లి విచారణ చేస్తే.. ఎవరైనా తమ కులం గురించి చెబుతారని తెలిపారు.