Casino Chikoti Arrested in Thailand: క్యాసినో కేసులో థాయ్‌లాండ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్, అతని అనుచరులతో పాటు.. క్యాసినో ఆడేందుకు వెళ్లిన వాళ్లను థాయ్‌లాండ్ పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు రూ.100 కోట్లు విలువ చేసే క్రెడిట్స్‌ను అక్కడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. థాయ్‌లాండ్‌లోని కోన్ బురి జిల్లా బ్యాంగ్ లా ముంగ్లో ఉన్న ఓ కన్వెన్షన్ హాల్లో క్యాసినో నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు కోన్ బురి జిల్లా పోలీస్ ఉన్నతాధికారి కాంపోల్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.
థాయ్‌లాండ్ పోలీసులు క్యాసినో నిర్వహించే వారిపై నిఘా: రూ.లక్షా 60 వేలు నగదు, 92 చరవాణిలు, ఒక ఐపాడ్‌తో పాటు.. మూడు ల్యాప్ టాప్‌లు, 25 సెట్ల ప్లే కార్డులు, సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల దృశ్యాలను నేరుగా హైదరాబాద్‌కు అనుసంధానం చేసినట్లు థాయ్‌లాండ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. క్యాసినో ఆడే వాళ్లపై నిఘా పెట్టేందుకే.. ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు థాయ్‌లాండ్ పోలీసులు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, చీకోటి ప్రవీణ్ అనుచరుడు మాధవరెడ్డితో పాటు పలువురు తెలుగు వాళ్లు కూడా ఉన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.
థాయ్‌లాండ్‌లోనూ క్యాసినో నిర్వహిస్తున్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు: అనుమతి లేకుండా క్యాసినో నిర్వహిస్తున్నట్లు థాయ్‌లాండ్ పోలీసులు తెలిపారు. చీకోటి ప్రవీణ్‌పై ఇప్పటికే హైదరాబాద్ ఈడీ అధికారులు ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోవాలో బిగ్ డాడీ, క్యాసినో పలు రకాల పేకాటలు నిర్వహిస్తున్న చీకోటి ప్రవీణ్.. ఆ తర్వాత శ్రీలంక, నేపాల్, థాయ్‌లాండ్‌లోనూ క్యాసినో నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి.. ఇక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్లడం, తిరిగి విదేశాల నుంచి ఇక్కడికి డబ్బులు తీసుకువచ్చనట్లు గుర్తించారు. ఇప్పటికే చీకోటి ప్రవీణ్‌తో పాటు పలువురిని ఈడీ అధికారులు పిలిచి ప్రశ్నించారు. దీనికి సంబంధించిన దర్యాప్తును ఈడీ అధికారులు కొనసాగిస్తున్నారు.